
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మదనపల్లి డీజీపీ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కొన్ని రోజుల క్రితం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం బండకాడ ఎస్సీ కాలనీలో ఓం ప్రకాశ్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఓం ప్రకాశ్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పెద్దిరెడ్డికి సంబంధం ఉందని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే సమర్పించాలని డీజీపీ నోటీసుల్లో చంద్రబాబును కోరారు.
Also Read : వైఎస్సార్ వర్థంతి: తండ్రిని మరిపిస్తున్న జగన్
చంద్రబాబు వైసీపీ నేతల వల్లే సదరు వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని… ప్రకాశ్ మృతికి పెద్దిరెడ్డి వర్గమే కారణమని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతో పాటు మదనపల్లి డీజీపికి ఆరోపణలను లేఖ రూపంలో రాశారు. దీంతో ఆ ఆరోపణల గురించి చంద్రబాబు దగ్గర ఏవైనా సాక్ష్యాలు ఉంటే పంపాలని డీజీపీ కోరారు. సీఆర్పీసీ సెక్షన్ 91 ప్రకారం చంద్రబాబు ఏవైనా ఆధారాలు ఉంటే వారం రోజుల్లోగా డీజీపీ కార్యాలయానికి హాజరై వాటిని అందజేయాల్సి ఉంది.
అయితే చంద్రబాబు సాక్ష్యాధారాలు ఉండటం వల్లే ఆరోపణలు చేశారా….? లేక సాధారణంగానే ప్రత్యర్థి పార్టీ మంత్రిపై ఆరోపణలు చేశారా….? అనే విషయాలు తెలియాల్సి ఉంది. గత నెల 24వ తేదీన బండకాడ ఎస్సీ కాలనీలో ఓం ప్రకాశ్ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు ఓం ప్రకాశ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వీడియో చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైరల్ అయిన వీడియోనే ఒక రకంగా ఓం ప్రకాశ్ మృతికి కారణమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓం ప్రకాశ్ వీడియో వల్లే ఆత్మహత్య చేసుకున్నాడా….? మంత్రి అనుచరులు అతనిని ఏమైనా బెదిరించారా….? ఓం ప్రకాశ్ ఆత్మహత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా….? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తులో సమాధానాలు దొరికే అవకాశం ఉంది.
Also Read : ఏపీలో మందుబాబులకు శుభవార్త