Lokesh Yuvagalam Padayatra
Lokesh Yuvagalam Padayatra: నారా లోకేష్ యువగళం యాత్ర మరో మైలురాయికి చేరనుంది. మంగళవారం 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తికానుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కావలి నియోజకవర్గం కొత్తపల్లి వద్ద రెండు వేల కిలోమీటర్ల యాత్రను లోకేష్ పూర్తిచేశారు. జనవరి 27న కుప్పం నియోజకవర్గం నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టారు. రాయలసీమీలోని నాలుగు జిల్లాల పరిధిలో యాత్ర పూర్తిచేశారు. 53 అసెంబ్లీ నియోజకవర్గాలు, 135 మండలాలు, 1297 గ్రామాల మీదుగా యాత్ర కొనసాగింది. 49 చోట్ల భారీ బహిరంగ సభల్లో లోకేష్ ప్రసంగించారు. రోజుకు సగటున 13 కిలోమీటర్ల యాత్ర కొనసాగుతోంది. మరో 2 వేల కిలోమీటర్ల మేర యాత్ర కొనసాగనుంది.
పాదయాత్ర ప్రారంభించి దాదాపు 153 రోజులవుతోంది. అయితే ఉత్సాహం, సందడి రోజులు గడిచే కొలదీ తక్కువ అవుతోంది. ప్రారంభం రోజున రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. అటు అనుబంధ విభాగాల ప్రతినిధులు, చివరకు చాలామంది ఎన్ఆర్ఐలు సైతం విచ్చేశారు. దీంతో ప్రారంభం అదిరిపోయింది. అయితే తరువాత అది క్రమేపీ తగ్గిపోయింది. నాడు చంద్రబాబు యాత్రలో రెండు ఫార్ములాలకు పెద్దపీట వేశారు. ఒకటి ప్రచారం, రెండూ జన సమీకరణ. దాదాపు ఏపీలోని అన్ని మీడియా సంస్థలు పాదయాత్ర కవరేజ్ చేసేలా ప్లాన్ చేశారు. పెద్ద చానళ్ల నుంచి సిటీకేబుల్ వరకూ అందరికీ యాడ్లు ఇచ్చేవారు. అటు నియోజకవర్గాల బాధ్యులు జన సమీకరణ చేసేవారు. అందుకు అయ్యే ఖర్చులు అంతా వారే భరించేవారు. కానీ ఇప్పుడు లోకేష్ పాదయాత్ర అనుకూల మీడియా తప్పించి.. మిగతా వాటిలో కవరేజ్ కావడం లేదు.
తనను తాను నాయకుడిగా మలుచుకునేందుకు లోకేష్ పాదయాత్రకు దిగి పెద్ద సాహసమే చేశారు. కానీ తమ భావి నాయకుడిగా టీడీపీ శ్రేణులు అంతగా భావించలేదు. చంద్రబాబు మాదిరిగా లోకేష్ ను ఓన్ చేసుకోవడం లేదు. ఇది పాదయాత్రకు మైనస్ గా మారింది. ప్రచారంలో కూడా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అప్పట్లో జగన్ పాదయాత్రకు సమాంతరంగా పీకే టీమ్ ప్రచారంతో హోరెత్తించింది. కానీ లోకేష్ కు ఆ స్థాయిలో ప్రచారం లేదు. పైగా పేవల ప్రసంగాలు మైనస్ గా మారాయి. నెలల తరబడి పాదయాత్ర చేస్తున్నా పెద్దగా మైలేజ్ రావడం లేదు.
ఇటీవల వారాహి యాత్రతో పవన్ జనాల్లోకి వస్తుండడం కూడా లోకేష్ యువగళం మరీ కళావిహీనంగా మారుతోంది. ఇలా పవన్ వస్తున్నారో లేదో మీడియా మొత్తం పవన్ వైపే తిరుగుతోంది. అటు పవన్ స్థాయిలో లోకేష్ ప్రసంగాలు ఉండడం లేదు. సంచలన కామెంట్స్ పెద్దగా వర్కవుట్ కావడం లేదు. చివరకు పవన్ మేనియాకు ఎల్లో మీడియా సైతం దాసోహం కాక తప్పడం లేదు. దాని ప్రభావం లోకేష్ యువగళం పాదయాత్రపై స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ వారాహి యాత్రతో పోల్చుకుంటే యువగళం రోజురోజుకు చప్పబడుతోంది.
వాస్తవానికి లోకేష్ పాదయాత్రను అధికార పక్షం లైట్ తీసుకుంది. దానికి కారణం ఆయన మాటల్లో డొల్లతనం, తత్తరపాటు. పాదయాత్రలో దానినే హైప్ చేసి పలుచన చేయ్యాలని డిసైడ్ అయ్యింది. కానీ అధికార పక్షం ఊహించినంతగా ఆయన ప్రసంగాలేవీ పేలవంగా లేవు. కొన్నిసార్లు బాగానే మాట్లాడుతున్నారు. కానీ నడక, అలసట, జన తాకిడి.,. వీటన్నింటి మధ్య ఆయన స్పీచ్ అక్కడక్కడా గాడిన తప్పుతోంది. దీంతో దీనినే వైసీపీ సోషల్ మీడియా అలుసుగా తీసుకుంటోంది. తెగ ప్రచారం చేస్తోంది. రకరకాలుగా కామెంట్లు పెడుతోంది. అయితే ఇప్పటివరకూ లోకేష్ పాదయాత్రపై పార్టీ శ్రేణుల్లో మాత్రమే సంతృప్తి కనిపిస్తోంది. ప్రజల్లో మాత్రం లేదు. ఇప్పటికైనా లోకేష్ పరిణితి ప్రదర్శించాల్సిన అవసరముంది.