Telangana: తెలంగాణలో పరిశ్రమల బాట పరుగులు పెడుతోంది. ఇప్పటికే పలు సంస్థలు హైదరాబాద్ లో పరిశ్రమల ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్న క్రమంలో పలు సంస్థలు ఇక్కడ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం ఆహ్వానించదగినదే. ఇప్పటికే పలు సంస్థల ప్రతినిధులు మంత్రి కేటీఆర్ ను కలిసి తమకు స్థలం చూపించాలని కోరారు. దీనిపై సంప్రదింపులు జరుపుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే నగరంలో పలు పరిశ్రమలు కొలువుదీరనున్నాయి. దీంతో నిరుద్యోగులకు సైతం ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి.

అంతర్జాతీయంగా పేరున్న క్యాప్స్ గోల్డ్ సంస్థతోపాటు వజ్రాల ప్రాసెసింగ్ సంస్థ హంటన్ రిఫ్లై వర్స్ సంస్థ ప్రతినిధులు కూడా కేటీఆర్ ను కలిసి తమ ప్రతిపాదనలు సమర్పించారు. ఈ నేపథ్యంలో వారికి 20 ఎకరాల స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరో ఆరు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నెల రోజుల్లో పరిశ్రమలపై ఓ క్లారిటీ రానుందని తెలుస్తోంది.
హైదరాబాద్ శివారులో ముత్యాలు, ఆభరణాల తయారీ సంస్థల కోసం ప్రత్యేకంగా సెజ్ ఉంది. గీతాంజలి గ్రూప్ ఓ పరిశ్రమ నిర్వహిస్తోంది. కొత్త పరిశ్రమలు కూడా నెలకొల్పే అవకాశం ఏర్పడింది. బంగారు ఆభరణాల పరిశ్రమల ఏర్పాటుతో రాష్ర్టం భవిష్యత్ కూడా మారనుంది. ఈ క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు ఇవ్వడంతో పరిశ్రమల యాజమాన్యాలు ఇక్కడ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉన్న మలబార్ గోల్డ్ పరిశ్రమను రాష్ర్టంలో ఏర్పాటు చేయాలని సంకల్పించింది. బంగారు ఆభరణాల దుకాణాల ద్వారా తెలంగాణ ఖ్యాతి మరింత పెరగనుంది. మంత్రి కేటీఆర్ చొరవతో పరిశ్రమలు రాష్ర్టంలో ఏర్పడటానికి మార్గం సుగమం కానుంది. రాష్ర్ట సర్వతోముఖాభివృద్ధి సాధించనుంది.