BRS On AP: రాజకీయ పార్టీల్లో జంపింగ్ లు కామన్. రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట వేసుకొని ఎక్కువ మంది పార్టీలు మారుతుంటారు. తమకు ఎక్కువ ప్రాధాన్యం, పదవులు, పవర్ ఎక్కడ దొరికిపోతే అక్కడికి చేరిపోతారు. కొందరు నాయకులకు ‘పవర్’ పాలిటిక్స్ కే ఇష్టపడతారు.. తప్ప ప్రతిపక్ష పార్టీలంటే వారికి అస్సలు ఇష్టముండదు. అటువంటి నాయకుల్లో ముందు వరుసలో ఉంటారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. రంగులు మార్చడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. నిత్యం చేతిలో అధికారం ఉండాలన్నది ఈ నేత అభిమతం. మొన్న ఈ మధ్య కాపుగళం వినిపించిన గంటా తాను టీడీపీలో యాక్టివ్ కానున్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో కానీ కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ వైపు అడుగులేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్రను టార్గెట్ చేస్తున్నారు.ఈ నెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అటు తరువాత విశాఖలో సభకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంతలో బడా నాయకులను పార్టీలో చేరుకోవాలని భావిస్తున్నారు. వివిధ పార్టీల కీలక నాయకులు తమకు టచ్ లో ఉన్నారని కేసీఆర్ పదేపదే చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, బీఆర్ఎస్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందతో మంతనాలు జరపడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ కు గంటాకు మధ్య వివేకానంద మధ్యవర్తిత్వం వహిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
గత ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుంచి గంటా టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. కానీ పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నిరాశకు గురయ్యారు. అప్పటి నుంచి అధికార వైసీపీకి భయపడి సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. అటు పార్టీకి కూడా అంటీముట్టనట్టుగా ఉన్నారు. చంద్రబాబు, లోకేష్ ల పర్యటనలకు సైతం ముఖం చాటేశారు. దీంతో ఆయన పార్టీకి దూరమైనట్టేనని అంతా భావించారు. అయితే గంటా టీడీపీకి రాజీనామా చేయలేదు. మరి ఏ ఇతర పార్టీల్లో చేరలేదు. ఇటీవల లోకేష్ పాదయాత్ర ప్రారంభించక ముందు ఆయనతో మంతనాలు సాగించారు. పార్టీలో యాక్టివ్ కానున్నట్టు సంకేతాలిచ్చారు. కానీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు గంటా ప్రకటనపై ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు. దీంతో మనసు నొచ్చుకున్న గంటా తన రాజకీయ భవిష్యత్ పై శరవేగంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాపునాడు నాయకుడు తోట రాజీవ్ అయితే గంటా తప్పకుండా బీఆర్ఎస్ లోకి వెళతారని హింట్ ఇచ్చారు. గంటా రావాలని బీఆర్ఎస్ మనసారా కోరుకుంటున్నా.. సదరు నేత మదిలో ఏ ముందో తెలియదు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు బీఆర్ఎస్ నుంచి ఓపెన్ ఆఫర్ ఒకటి వచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ లోకి వస్తే రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. గత ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిగా పోటీచేసిన జేడీ తరువాత పార్టీకి దూరమయ్యారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి విశాఖ ఎంపీగా పోటీచేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి కన్ఫర్మ్ అయితే బీజేపీ తరుపున బరిలో దిగుతారన్న ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఓపెన్ ఆఫర్ తో కాస్తా ఆలోచనలో పడినట్టు తెలుస్తోంది. అలాగని ఓకే చెప్పకుండా కొద్దిరోజులు వేచిచూసే ధోరణిలో ఉన్నట్టు సమాచారం. మొత్తానికైతే కేసీఆర్ తన బీఆర్ఎస్ విస్తరించే క్రమంలో బడా నేతలను వలపట్టుకొని పట్టే పనిలో ఉన్నారు.