K. Viswanath Remuneration: సాధారణంగా ఆర్ట్ సినిమాలకు మార్కెట్ ఉండదు. ఆ తరహా చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులు తక్కువగా ఉంటారు. సినిమా అంటే బిజినెస్ లెక్కలు కూడా చూసుకోవాలి కాబట్టి చాలామంది దర్శక నిర్మాతలు ఆ సాహసం చేయరు. కానీ విశ్వనాథ్ గారి గొప్పతనం ఏమిటంటే… ఆర్ట్ సినిమాలను కమర్షియల్ గా సక్సెస్ చేశారు. మాస్ హీరో చిరంజీవితో కూడా ఆయన క్లాస్ మూవీ ట్రై చేశారు. ఇక శంకరాభరణం విజయం ఎవరూ ఊహించని మలుపు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ సోమయాజులు హీరో అనగానే… అబ్బే సినిమా ఆడదండీ అని పలువురు పెదవి విరిచారు. నిజంగానే శంకరాభరణం పోస్టర్స్ చూసి… ఆడియన్స్ థియేటర్స్ వైపు వెళ్ళలేదు.

దాదాపు అన్ని థియేటర్స్ లో పెద్దగా డిమాండ్ ఉండని మార్నింగ్ షో కేటాయించాట. ఓ థియేటర్ కి ఫస్ట్ డే కేవలం నలుగురు ఆడియన్స్ మాత్రమే వెళ్లారట. ఓపెనింగ్స్ చూసి డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు ఫిక్స్ అయ్యారట. అయితే ప్రేక్షకుల మౌత్ టాక్ తో సినిమా మెల్లగా పుంజుకుంది. జనాల్లో శంకరాభరణం సినిమా గురించి చర్చ మొదలైంది. చిలికి చిలికి గాలివాన అన్నట్లు…. శంకరాభరణం థియేటర్స్ ఎదుట హౌస్ ఫుల్ బోర్డ్స్ వెలిశాయి. వారం రోజులు కూడా ఆడదనుకున్న సినిమా సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ జరుపుకుంది.
ఒక ఆరాధనాభావంతో ప్రేక్షకులు సినిమాను ఆదరించారు. శంకరాభరణం ఆడుతున్న థియేటర్స్ దేవాలయాల్లా మారిపోయాయి. చెప్పులు బయట విడిచి థియేటర్స్ లోకి వెళ్లేవారట జనాలు. ట్రేడ్ వర్గాలను విస్మయపరిచేలా శంకరాభరణం వసూళ్లు సాధించింది. కాగా ఈ సినిమా సక్సెస్ తర్వాత కే.విశ్వనాధ్ గారికి ఆఫర్స్ వెల్లువెత్తాయట. ఆ ఆఫర్స్ అన్ని ఒప్పుకుని ఉంటే అప్పట్లో సగం హైదరాబాద్ ని కొనేసే వాడినని కే.విశ్వనాథ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

దర్శకుడిగా ఎనలేని కీర్తి గడిచినా విశ్వనాథ్ గారు ఏనాడూ డబ్బుకి ఆకర్షితులు కాలేదు. సమకాలీన దర్శకులతో పోల్చుకుంటే కే.విశ్వనాథ్ తక్కువగానే రెమ్యూనరేషన్ తీసుకునేవారట. ఒకటి రెండు సందర్భాల్లో మీ రెమ్యూనరేషన్ ఎంతని అడిగితే… ఆయన నవ్వుతూ , ఆ మాట మీరు అడక్కూడదు నేను చెప్ప కూడదు అని సమాధానం చెప్పారు. తన సినిమాలకు కే.విశ్వనాథ్ అన్నీ తానై వ్యవహరించేవారు. ఒక్కోసారి డాన్స్ మాస్టర్ అందుబాటులో లేకుంటే సాంగ్స్ కంపోజ్ చేసేవారట. దానికి నిర్మాతల వద్ద అధిక రెమ్యూనరేషన్ డిమాండ్ చేవారు కాదట. మనకు ఎంత ఇవ్వాలో ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసని నమ్మే విశ్వనాథ్ గారు డబ్బును తుచ్ఛంగా చూశారు.