Pawan Kalyan- Film Industry: జనసేనాని పవన్ కళ్యాణ్ వైపు ఇప్పుడు సినీ పరిశ్రమ చూస్తోందా? ఆయనపై ఎట్టకేలకు నమ్మకం కుదిరిందా? రానున్న కాలంలో సినీ ప్రముఖులు, పవన్ సహచర నటులు బహిరంగ మద్దతు పలకనున్నారా? ఇప్పుడిప్పుడే వారు మౌనం వీడుతున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలు కూడా అచ్చం అలాగానే ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో పాటు ఇటు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా సినిమాలు పూర్తిచేసి పూర్తిస్థాయిలో సినిమాలపై కన్సంట్రేట్ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కౌలురైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు కుటుంబాలకు రూ.లక్ష చొప్పున అందిస్తున్నారు. కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతోంది. అక్టోబరు నుంచి పాదయాత్రతో సమానంగా ఓ కార్యక్రమాన్ని పవన్ రూపొందించారు. ఇందుకు సంబంధించి సన్నాహలు కూడా చేసుకుంటున్నారు. అయితే పవన్ గతం కంటే దూకుడు పెంచారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా జనసేన పార్టీ జెండా ఎగురవేస్తానని గంటాపధంగా చెప్పుకొస్తున్నారు. జనసేన అవసరాన్ని కూడా చాటిచెబుతున్నారు. ఇక తేల్చుకోవాల్సింది రాష్ట్ర ప్రజలేనంటూ కొత్త స్లోగన్ అందుకున్నారు. పవన్ సమస్యలపై స్పందిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోంది. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘ కాలం అయినా పవన్ ఎప్పుడూ అధికారానికి అర్రులు చాచలేదు. అయితే వైసీపీ పాలనలో రాష్ట్రం అన్నివిధాలా దగాకు గురైనందున జనసేనకు ఒక అవకాశం ఇస్తే గాడిలో పెడతామంటూ పవన్ ప్రజలకు విన్నవిస్తున్నారు.దీంతో అన్నివర్గాల్లో సైతం ఆలోచన ప్రారంభమైంది. జనసేన గురించి ఆలోచించడం ప్రారంభించారు.
-గత ఎన్నికల్లో సినీ పరిశ్రమ మద్దతు దక్కలేదు
గత ఎన్నికల్లో జనసేన పోటీచేసినా.. సినీ పరిశ్రమ నుంచి మాత్రం ఆశించిన స్థాయిలో మద్దతు దక్కలేదు. వైసీపీతో పాటు టీడీపీకి కొంత మంది సినీ ప్రముఖులు బాహటంగా మద్దతు పలికారు. ముఖ్యంగా వైసీపీ తరుపున చాలామంది బహిరంగంగానే ప్రచారం చేశారు. తీరా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీన్ రివర్స్ అయ్యింది. ఆన్ లైన్ టిక్కెట్ విధానం తెరపైకి తెచ్చి సినీ పరిశ్రమనే ఇబ్బందిపెట్టారు. చిరంజీవి నేతృత్వంలోని సీని ప్రముఖులు కలిసినా కనికరించలేదు. దీంతో వైసీపీపై సినీ పరిశ్రమలో వ్యతిరేకత ప్రారంభమైంది. అదే సమయంలో సమస్యలపై పట్టువిడవకుండా వ్యవహరిస్తున్న పవన్ పై వారికి నమ్మకం కుదిరింది. అందుకే పవన్ కు మద్దతుగా చాలామంది ప్రముఖులు వ్యాఖ్యానించడం ప్రారంభించారు. థర్టీ ఈయర్స్ పృధ్వీ అయితే పవన్ కు బహిరంగ మద్దతు ప్రకటించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున ప్రచారం చేసిన పృధ్వీ పవన్ పై విరుచుకుపడేవారు. వ్యక్తిగత కామెంట్స్ చేసేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పృధ్వీకి టీటీడీ భక్తి చానల్ చైర్మన్ పదవి దక్కింది. కానీ ఆయన అనుచితంగా ప్రవర్తించారంటూ పదవి నుంచి తప్పించారు. కనీసం తన వెర్షన్ ను వినకుండా జగన్ ఏక పక్షంగా నిర్ణయం తీసుకోవడంతో పృధ్వీకి తత్వం బోధపడింది. పవన్ విషయంలో చేసిన తప్పిదాన్ని క్షమించమని కోరడంతో పాటు త్వరలో జనసేనలో చేరుతానని సైతం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పవన్ సత్తా చూపడం ఖాయమని పృధ్వీ నమ్మకంగా చెబుతున్నారు.
Also Read: Jagdeep Dhankhar: వెంకయ్యకు షాక్ లగా.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్?
-పవన్ ఎప్పటికైనా సీఎం అవుతారు..
మరోవైపు సినీ ప్రముఖుడు, యాక్టివ్ రాజకీయాలకు కొద్దిరోజులుగా దూరంగా ఉన్న మురళీమోహన్ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి. పవన్ ఎప్పటికైనా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టారు. అయితే అది ఎప్పుడో చెప్పలేం కానీ.. పవన్ సీఎం కావడం పక్కా అని మాత్రం చెబుతున్నారు. మురళీమోహన్ టీడీపీలో సీనియర్ నాయకుడు. గత ఎన్నికల నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ టీడీపీలోనే మాత్రం కొనసాగుతున్నారు. అటువంటి వ్యక్తి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. పవన్ కు సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎవరైనా పార్టీ పెట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురైతే వెనక్కి తగ్గుతారని.. కానీ పవన్ మాత్రం తనకు ఓటమి ఎదురైనా నమ్మిన కార్యకర్తలకు భరోసా కల్పించేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారని.. ఈ లక్షణం ఆయన సీఎం అయ్యేందుకు చాలునన్నారు. చిరంజీవి, నాగబాబు సొదరులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని.. కానీ పవన్ తో మాత్రం అంతగా లేవన్నారు. అయినా ఆయన పోరాట పటిమ మాత్రం గొప్పదంటూ మురళీమోహన్ బదులిచ్చారు. ఈ తాజా వ్యాఖ్యలతో జన సైనికులు ఖుషీ అవుతున్నారు. మురళీమోహన్ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు.
-జనసేనకు పెరుగుతున్న మద్దతుదారులు..
తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కు మద్దతుదారులు పెరుగుతున్నారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకి సపోర్టు చేసిన వారు సైతం పునరాలోచనలో పడ్డారు. సినీ పరిశ్రమ నుంచి ఒకరు రాజకీయంగా ఎదిగితే తమకే లాభమని భావిస్తున్నారు. దీనికి కారణాలు లేకపోలేదు. ఇటీవల సినీ పరిశ్రమపై ఏపీ సర్కారు కత్తి కట్టింది. కొవిడ్ తో అస్తవ్యస్తంగా మారిన సినీ పరిశ్రమ కోలుకుంటున్న తరుణంలో ఆన్ లైన్ టిక్కెట్ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ఇదేమని ప్రశ్నించిన వారిపై వైసీపీ మంత్రులు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. కించపరుస్తూ మాట్లాడారు. అటు వైసీపీకి మద్దతు తెలిపిన సినీ ప్రముఖులు సైతం మౌనాన్ని ఆశ్రయించారు. స్వయంగా పరిశ్రమ పెద్దగా చొరవ తీసుకొని చిరంజీవి సహ నటులు, నిర్మాతలు, దర్శకులు, ప్రముఖులను తీసుకెళ్లి సీఎం జగన్ ను కలిసినా ఫలితం లేకపోయింది.అప్పటి నుంచే సినీ పరిశ్రమలో ఒక రకమైన భావన నెలకొంది. పవన్ కు సానుకూల దృక్పథం కలగడానికి కారణమైంది.