India Alliance: నరేంద్ర మోడీ ఏ ముహూర్తాన ఆ విమర్శలు చేశారో తెలియదు గాని.. అవన్నీ వాస్తవంలో కనిపిస్తున్నాయి. కేవలం ఆరు నెలల్లోనే ఇండియా కూటమి కాకావికలం అయిపోతోంది. హర్యానా(Haryana), మహారాష్ట్ర(Maharashtra) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. జార్ఖండ్(Jharkhand), జమ్మూ కాశ్మీర్(Jammu Kashmir) లోనూ పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. ఇక దానికి తోడు గౌతమ్ అదాని (Gautam Adani) వ్యవహారంలో సమాజ్ వాద్ పార్టీ(SP), తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీలు కాంగ్రెస్ తో స్వరం కలపలేకపోయాయి. ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ తమిళనాడు వరకే చాలంటూ ఆగిపోయింది. ఇక మహారాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ, ఇతర పార్టీలు విడిపోయాయి. దీంతో ఇప్పట్లో అవి కలిసే పరిస్థితి లేదు. మరోవైపు ఇండియా కూటమి కేవలం పార్లమెంటు ఎన్నికల వరకేనని రాష్ట్రీయ జనతాదళ్ స్పష్టం చేసింది. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఆప్ కే తాము మద్దతు ఇస్తామని ప్రకటించింది. దీంతో ఇండియా కూటమికి బీటలు వారాయి.
ఓమర్ అబ్దుల్లా ఏమంటున్నారంటే..
ఇండియా కూటమికి బీటలు వారాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహార సాగుతోందని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల వరకే ఇండియా కూటమి అని అనుకుంటే తప్పనిసరిగా దాని మూసివేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి వ్యూహాలు రచించకపోవడం.. ఒకవేళ అవి రచించినా అమల్లో పెట్టకపోవడం అత్యంత దారుణమని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రీయ జనతా నేత తేజస్వి యాదవ్ ఇండియా కూటమిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం పార్లమెంటు ఎన్నికల వరకే ఇండియా కూటమి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలు తమ అవసరాల దృష్ట్యా స్థానిక ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పేర్కొన్నారు. కలిసి పోటీ చేయాలని సందర్భం వచ్చినప్పుడు.. ఒంటరిగానే ఎన్నికల బరిలో ఉండి.. తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవచ్చని పేర్కొన్నారు. తేజస్వి యాదవ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో… జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. ” ఇండియా కూటమికి బీటలు వారాయి. ఇకపై ఆ కూటమి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. ఈ లెక్కన చూస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు నిజమవుతున్నాయి. ఇవే గనుక మునుముందు కొనసాగితే దేశంలో బలమైన ప్రతిపక్షం అంటూ ఉండదు. మోడీ ఆడుతున్న గేమ్లో ఇండియా కూటమి చిక్కి విలవిలలాడిపోవడం అత్యంత దారుణమని” రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.