King Cobra : ఆ ఆలయం అంతా ఓం నమః శివాయ మంత్రోచ్ఛారణతో నిండిపోయింది. అది కార్తీక మాసం కాదు. కార్తీక పౌర్ణమి కూడా కాదు. కానీ భక్తులు ఆలయంలో జరిగిన అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయి శివ నామాన్ని జపించారు. స్థానిక భక్తులే కాకుండా, ఇతర గ్రామాల నుండి కూడా ఆ శివాలయంలో జరిగిన అద్భుతాన్ని చూడటానికి తండోపతండాలుగా వచ్చారు. అసలు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం రాయలి గ్రామంలోని శివకేశవాలయాల మధ్య ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ, గణపతి ఆలయాలలో పాములు కంగారు పెట్టించాయి. రెండు రోజులుగా శివలింగం దగ్గర ఒక పాము తిరుగుతుండటం చూసి ఆలయ పూజారి ఆశ్చర్యపోయాడు. విషయం బయటకు తెలియడంతో పామును చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
రెండు రోజులుగా నాగుపాము బయటకు రాకపోవడంతో పూజారులు దేవునికి ప్రసాదం సమర్పించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాము దేవాలయాల నుండి దూరంగా వెళ్ళకపోవడంతో, ఆలయ కమిటీ రాజమండ్రికి చెందిన పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ చింతా సూర్య చంద్రరావు మాట్లాడుతూ.. పాములు పట్టే వ్యక్తి దాదాపు రెండు గంటలు పనిచేసి పామును చాకచక్యంగా పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశాడని తెలిపారు.
ఐఏఎస్ అధికారి కారు బోనెట్‌లో పాము
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో, సచివాలయ ప్రాంగణంలో ఒక ఐఏఎస్ అధికారి కారు బోనెట్‌లో ఒక పాము కనిపించింది. చాలా శ్రమ తర్వాత దానిని తొలగించారు. కారులో పామును చూసిన తర్వాత అధికారులలో కలకలం రేగింది. పామును చూసిన భద్రతా సిబ్బంది గేటును పూర్తిగా మూసివేశారు. SDRF బృందం పామును పట్టుకుని సురక్షితమైన ప్రదేశంలో వదిలివేసింది. ఆ విషపు పాము దాదాపు 4 గంటల పాటు కారులోనే ఉంది.
సచివాలయ సముదాయం చుట్టూ దట్టమైన పొదలు, ఖాళీ స్థలాలు ఉన్నాయి. దీని కారణంగా సమీపంలో పాములు లేదా ఇతర అడవి జంతువులు కనిపిస్తాయి. అంతకు ముందు, ముంబైలోని మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సమయంలో ఒక పాము కనిపించింది. ఆ పాము దాదాపు 2 అడుగుల పొడవు ఉంది. అయితే ఆ పాము మళ్ళీ మాయమైంది. ఎంత వెతికినా దాని ఆచూకీ దొరకలేదు, ఆ తర్వాత విచారణ తిరిగి ప్రారంభమైంది.