రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులోనూ ఎదురుదెబ్బ తప్పలేదు. ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని, హైకోర్టు తీర్పులో పేర్కొన్న అంశాల ప్రకారం నిమ్మగడ్డ నియామకం చెల్లదని రాష్ట్ర ప్రభుత్వం తన పిటీషన్ లో పేర్కొంది. ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ బోబ్డే, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.
ప్రభుత్వం కోరిన విధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని, నోటీసులు రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది.
విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు తగదని వ్యాఖ్యానించింది. ఎస్‌ఈసీ పదవీ కాలం కుదింపు ఆర్డినెన్స్ వెనుక ప్రభుత్వ ఉద్దేశాలు సంతృప్తికరంగా లేవని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే ప్రశ్నించారు. రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారితో ఆటలాడుకోవద్దని పేర్కొన్నారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కేసులో హైకోర్టు.. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రద్దు చేయడంతో పాటు జస్టిస్ కనగరాజ్ నియామకానికి సంబంధించిన జి.ఒలను రద్దు చేసింది. అదే సమయంలో ఎస్.ఈ.సిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగించాలని ఆదేశించిన విషయం విదితమే. ప్రభుత్వం మాత్రం ఈ తీర్పుపై తొలుత హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అనంతరం ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకుని సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.