ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు భరోసా స్కీమ్, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ జలకళ, ఇతర స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రైతు భరోసా స్కీమ్ ద్వారా జగన్ సర్కార్ రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ వాళ్లకు ప్రయోజనం చేకూర్చిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తామని చెప్పారు.
ఈరోజు సీఎం జగన్ వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు కీలక సూచనలు చేశారు. సీఎం జగన్ ఈ సమావేశంలో మాట్లాడుతూ ఏ సీజన్ ఇన్ పుట్ సబ్సిడీను ఆ సీజన్ లోనే జమ చేస్తామని తెలిపారు. వైఎస్సార్ రైతు భరోసా రెండో విడత చెల్లింపులతో పాటు ఖరీఫ్ ఇన్ పుట్ సబ్సిడీని కూడా ఇస్తామని రైతులకు సీఎం జగన్ మరో తీపికబురు చెప్పారు. ఈ నెల 27వ తేదీన గడిచిన నాలుగు నెలల ఇన్ పుట్ సబ్సిడీ రైతుల ఖాతాలలో జమవుతుందని పేర్కొన్నారు.
ఉద్యాన పంటలకు, ఖరీఫ్ పంటలకు ఇన్ పుట్ సబ్సిడీని జమ చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఖరీఫ్ పంటల కోసం 113 కోట్ల రూపాయలు, ఉద్యాన పంటల కోసం 32 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. నవంబరు 15వ తేదీ లోపు ఈ నెల ఇన్ పుట్ సబ్సిడీకి సంబంధించిన నివేదిక అందాలని జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని కొందరు గిరిజన రైతులకు అటవీ భూముల పట్టాలు ఇచ్చామని.. వైఎస్సార్ రైతు భరోసా స్కీమ్ ద్వారా వీరికి కూడా నగదు జమ చేయనున్నామని సీఎం వెల్లడించారు. గతంలో వీళ్లు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందని నేపథ్యంలో 11,500 రూపాయలు వీళ్ల ఖాతాలలో జమ చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు. జగన్ ప్రకటనపై రాష్ట్రంలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.