
పేదలు తల దాచుకోవడానికి ఇల్లు అవసరం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసింది. నిరుపేదలు ఇల్లు నిర్మించుకోవడానికి సెంటు స్థలం ఉచితంగా అందజేస్తోంది. అలాగే ఇంటి నిర్మాణానికి మూడు ఆప్షన్లు సైతం ఇచ్చింది. ఇందులో మూడో ఆప్షన్ ఏంటంటే ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. లబ్ధిదారులపైనే భారం వేసింది. దీంతో వారు లబోదిబోమంటున్నారు.
ఇల్లు కట్టుకోకపోతే అనుమతి రద్దు అవుతుందని బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం కట్టుకుంటే డబ్బు కావాలి. లేదంటే పోతుందనే ఉద్దేశంతో ఎలాగైనా ఇల్లు నిర్మించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. సొంత డబ్బులు పెట్టుకుని పునాదుల వరకు నిర్మాణం చేపడుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు ఎందుకు కొరగావడం లేదు. దీనిపై ప్రభుత్వం మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు ఇళ్ల నిర్మాణంలో ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ఓ ఇల్లు కట్టుకోవడానికి ఇంత కంటే ఎక్కువ ఖర్చు ఎందుకవుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తామే రవాణా చేస్తున్నామని సిమెంట్ కూడా తక్కువ ధరకే అందజేస్తున్నామని తెలిపారు. మంత్రి ప్రకటనపై లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.
ప్రభుత్వమే ఇల్లు కట్టస్తే లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. కానీ వారికి అప్పులే మిగులుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు. కానీ లబ్ధిదారులే పునాదులు నిర్మించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వాలని చెబుతున్నా పట్టించుకోవడం లేదు. రూ.1.80 లక్షలు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. ఇంత తక్కువ మొత్తంతో ఇల్లు కట్టుకోవడం కష్టమే. నిరుపేదలు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం మాత్రం అంతకు మించి ఒక్క రూపాయి కూడా ఇచ్చేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.