RK On Chandrababu: తెలుగు నాట మీడియా ఆధిపతులకు రాజకీయ నాయకులకు దగ్గరి సంబంధ బాంధవ్యాలు ఈనాటివి కావు. గతంలో ఎన్టీఆర్ ను రామోజీరావు ఏ స్థాయిలో ఆకాశానికి ఎత్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత రామోజీరావు అవసరం మారిపోయాయి కాబట్టి సీనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారు. చంద్రబాబు పంచన చేరారు. ఒకవేళ సీనియర్ ఎన్టీఆర్ తో టర్మ్స్ బాగుంటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో. ఇక అప్పట్లో దాసరి నారాయణరావు స్థాపించిన ఉదయం పత్రిక కాంగ్రెస్ పార్టీకి ఏ స్థాయిలో డప్పు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వార్త పత్రిక కూడా గిరిష్ సంఘీ కి రాజ్యసభ సీటు ఇవ్వగానే కాంగ్రెస్ పార్టీకి వకల్తా పుచ్చుకోవడం మొదలుపెట్టింది. కొంతకాలానికి ఈ జాబితాలోకి వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలోని ఆంధ్రజ్యోతి చేరింది. చంద్రబాబుకు డప్పు కొట్టే పత్రికల్లో ఒకప్పుడు ఈనాడు ప్రథమ స్థానంలో ఉంటే.. మెల్లిమెల్లిగా ఆస్థానాన్ని ఆంధ్రజ్యోతి ఆక్రమించుకోవడం మొదలుపెట్టింది. నిజమో అబద్దమో, తప్పో, ఒప్పో ఏదైనా సరే చంద్రబాబు కోణంలో వార్తలు రాయడం ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పెన్నుతో పెట్టిన విద్య. అయితే ఇప్పుడు ఆ కోణమే చంద్రబాబుకు ప్రతిబంధకంగా మారిందని ఏపీ రాజకీయ వర్గాలు అంటున్నాయి.
జగన్మోహన్ రెడ్డితో విభేదించిన అనంతరం వైయస్ షర్మిలకు వేమూరి రాధాకృష్ణ ఎనలేని ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టాడు. ముందుగా ఆమె తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకుంది. అయితే ఇక్కడ ఎదురు దెబ్బ తగలడంతో ఏపీకి వెళ్లిపోయింది. ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించింది. అయితే తెలంగాణలో ఇచ్చినట్టే షర్మిలకు రాధాకృష్ణ అక్కడ ప్రయారిటీ ఇస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం కాబట్టి.. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాబట్టి.. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆ కోణంలో రాధాకృష్ణ షర్మిలకు విలువైన స్పేస్ కేటాయిస్తున్నాడు. కానీ ఇక్కడే ఆయన అసలు విషయం మరుస్తున్నాడని ఏపీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సహజంగా చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో ప్రయారిటీ ఆంధ్రజ్యోతి నారా లోకేష్ కు ఇస్తుంది. అయితే కొంతకాలంగా షర్మిల వల్ల లోకేష్ కు వేమూరి రాధాకృష్ణ న్యాయం చేయలేకపోతున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి.
ముందుగానే చెప్పినట్టు షర్మిలకు ప్రయారిటీ ఇచ్చే క్రమంలో భాగంగా ఫేడ్ అవుట్ అయిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాడు. వాటికి ఫస్ట్ పేజీలో ప్రయారిటీ ఇస్తున్నాడు. సహజంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు అయితే టిడిపికి లేదా జనసేనకు మరలాలి. అప్పుడే రాధాకృష్ణకు అనుకూలమైన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒకవేళ ఆ వ్యతిరేక ఓటు గనుక కొంతలో కొంత షర్మిల సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీకి బదిలీ అయితే పరిస్థితిలో తేడా వస్తుంది. అప్పుడు అది జగన్మోహన్ రెడ్డికి బలం చేకూర్చుతుంది. ప్రస్తుతం రాధాకృష్ణ రాస్తున్న రాతల వల్ల షర్మిలకు లాభం అని ఏపీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ చిన్న లాజిక్ రాధాకృష్ణ ఎలా మర్చిపోయాడు? వార్తాపత్రికలు వార్తలు రాస్తే జనం ఎగేసుకుపోయి ఓట్లు వేసే రోజులు కావు ఇవి అంటారా? అది కూడా వ్యాలిడ్ ప్రశ్నే. ఏమో ఒకవేళ రాధాకృష్ణ రాతలు నమ్మి జనం షర్మిలకు ఓటేస్తే.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాదిరి ఆంధ్రలో అధికారంలోకి వస్తే.. అది కూడా రాధాకృష్ణకు ప్లస్ పాయింటే కదా.. అసలే దేశముదురు జర్నలిస్టు.. తక్కువ అంచనా వేయడానికి లేదు. షర్మిల జగన్ మోహన్ రెడ్డితో విభేదిస్తోంది అని రాసిందే రాధాకృష్ణ.. ఆ సంగతి మర్చిపోతే ఎలా.