TDP and BJP: నువ్వా దరిని నేనీ దరిని అమరావతి కలిపింది ఇద్దరిని అన్నట్లు పార్టీల్లో దూరం క్రమేపీ తగ్గుతోంది. ఇన్నాళ్లూ ఎడమొహం పెడమొహంగా ఉన్న పార్టీలకు అమరావతి వేదికగా కానుంది. 2024లో అధికారమే లక్ష్యంగా పార్టీల్లో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అటు బీజేపీ ఇటు టీడీపీ ల్లో కూడా సఖ్యత కనబడుతున్నట్లు తెలుస్తోంది. అమరావతి ఉద్యమంలో రైతులు చేస్తున్న పాదయాత్రకు బీజేపీ మద్దతు తెలిపిన నేపథ్యంలో రెండు పార్టీల్లో అభిప్రాయ భేదాలు క్రమంగా కనుమరుగు కానున్నాయని తెలుస్తోంది.

అమరావతి ఉద్యమంలో పాల్గొన్న రైతులకు మద్దతు తెలపాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన సందర్భంగా బీజేపీ నేతలకు క్లాస్ తీసుకోవడంతో బీజేపీ నేతల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఇంత కాలం దూరంగా ఉన్న బీజేపీ, టీడీపీ శ్రేణులు పాదయాత్రలో కలుసుకున్నారు. రెండు పార్టీల నేతలు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతూ కనిపించారు. దీంతో రెండు పార్టీల్లో రాబోయే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న సంఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించి వైసీపీ తీరుపై విమర్శలు చేశారు. దీంతో టీడీపీ, జనసేన కూడా కలిసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే అవకాశాలు ఏర్పడుతున్నాయి. గతంలో ఎన్నడు లేనంత సమన్వయం నేతల్లో కనిపిస్తోంది.
Also Read: India -Pakistan war in 1971: భారత్ -పాక్ యుద్ధం..: 1971 డిసెంబర్ నెలలో ఏం జరిగింది..?
ఇప్పటికే బీజేపీ, టీడీపీలు కలిసిపోయాయనే వార్తలు వస్తున్నాయి. బీజేపీ టీడీపీని అక్కున చేర్చుకుంటుందా? లేక పక్కన పెడుతుందా అని ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం జనసేనతో పొత్తు ఉన్న నేపథ్యంలో అన్ని సమీకరణలు బేరీజు వేసుకుని ఏ పార్టీని బీజేపీ చేర్చుకుంటుందో అనే సంశయాలు వస్తున్నాయి. ఏదేమైనా రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమీకరణలు మారి పరిస్థితులు ఎలా ఉంటాయోనని అందరిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Mudragada Padbanabham: ముద్రగడ తీరు పవన్, చంద్రబాబుకు వ్యతిరేకంగానేనా..?