ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం కోసం ఎన్నో ఏళ్లు తపించారు. అంతకుమించి శ్రమించారు. ఆయన కష్టానికి తగినట్లుగా ప్రజలు కూడా బంపర్ మెజార్టీని కట్టబెట్టారు. తిరుగులేదని నిరూపించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొంది మిగితా పార్టీలకు నిద్రలేకుండా చేశారు. ఇక అప్పటి నుంచే దేశవ్యాప్తంగా జగన్ వైపు చూడడం ప్రారంభమైంది.
అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేశాక ఆ వెంటనే మంత్రివర్గ కూర్పులో అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. జగన్ రెడ్డి సామాజిక వ్యక్తి కాబట్టి.. జగన్ అధికారంలోకి వస్తే… రాష్ట్రం మొత్తం రెడ్డీల రాజ్యం వస్తుందని చాలా మంది విమర్శించారు. కానీ.. వాటన్నింటినీ బలాదూర్ చేస్తూ.. జగన్ తన టీమ్‌లో అందరికీ సముచిత స్థానం కల్పించారు. కొత్త ఎమ్మెల్యేలకు సైతం అవకాశం కల్పించారు. అయితే.. అవకాశం వచ్చిందని అందరూ జగన్ మేలు కోరి పాలనలో భాగస్వామ్యం కావాల్సింది పోయి.. ఇప్పుడు జగన్‌కు తలనొప్పిలా మారుతున్నారని తెలుస్తోంది.
జిల్లాల్లో ఎంతోమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన వారు సైతం ఉన్నారు. కానీ.. వారిని పక్కనబెట్టి మరీ జగన్ జూనియర్లకే అవకాశం కల్పించారు. దీంతో సీనియర్లలో కోపం కనిపించింది. ఇప్పటికి కూడా వారు ఏదైనా పని చేయించుకోవాలంటూ తమకంటే జూనియర్ అయిన మంత్రి దగ్గరకు వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో సీనియర్లు చాలావరకు ఇబ్బంది పడుతున్నారు.
ఇక.. ఆ జూనియర్ మంత్రులు సైతం బెట్టు చేస్తున్నట్లుగా అధినేత దృష్టికి పోయినట్లు సమాచారం. తమకు సీఎం అండ ఉంది.. అనే ధీమా వారిలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సీనియర్ ఎమ్మెల్యేలు.. ఆ జూనియర్ మంత్రలు మధ్య సఖ్యత లోపించినట్లుగా కనిపిస్తోంది. ఏ జిల్లాలో చూసినా మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్లుగానే నడుస్తోంది. అటు అధికారులు సైతం సీనియర్ ఎమ్మెల్యేల మాటలు కాకుండా.. జూనియర్ మంత్రుల పనులే చేస్తున్నట్లుగా టాక్. మరి జగన్ ఈ మధ్య ఏమైనా మంత్రివర్గ విస్తరణ చేపడుతారా..? అందులో ఎవరెరవరికి ఉద్వాసన పలికే అవకాశాలు ఉండొచ్చు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి మున్ముందు జగన్ కేబినెట్‌లో ఎలాంటి మార్పులు జరుగబోతున్నాయో.