India-US Relations: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లిక్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్.. 47వ అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణం చేశారు. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జన్మతః పౌరసత్వం రద్దు చేశారు. అక్రమంగా అమెరికా(America)లో ఉంటున్నవారిని స్వదేశాలకు పంపిస్తున్నారు. ఇక అనేక నిర్ణయాలతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఐరన్ డోమ్ నిర్మాణానికి కూడా ప్రతిపాదన చేశారు. ఈ క్రమంలో వారం తర్వాత అమెరికా కొత్త అధ్యక్షుడికి భారత ప్రధాని నరేంద్రమోదీ(Narandra Modi) ఫోన్ చేశారు. కీలక అంశాలపై చర్చలు జరిపారు. ట్రంప్ 2.0 అడ్మినిస్ట్రేషన్‌లో అమెరికా–భారత్ సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు. రెండోసారి యూఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ శ్రేయస్సు, శాంతితోపాటు భద్రత కోసం కృషి చేస్తామని చెప్పారు. వాణిజ్య సమస్యలు, ఇమ్మిగ్రేషన్(Immigretion) విధానాలపై ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య సంబంధాలను ఇవి ప్రభావితం చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
ఎక్స్‌లో పోస్టు చేసిన మోదీ..
ట్రంప్‌తో చర్చించిన అంశాలను మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. అమెరికాతో సంబంధాల గురించి అందులో ప్రస్తావించారు. రెండు పక్షాలూ ఉపయోగకరమైన, నమ్మకమైన పార్ట్‌నర్‌షిప్‌ను నిర్మించడానికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు. టెక్నాలజీ, వాణిజ్యం, డిఫెన్స్, ఇన్వెస్ట్‌మెంట్, ఎనర్జీ వంటి రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకునే మార్గాలపై ట్రంప్‌తో చర్చించినట్లు వివరించారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లోని పరిస్థితులు సహా ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను పంచుకున్నారు. త్వరలో ఇద్దరూ కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
వైట్‌హౌస్ కీలక ప్రకటన..
ఇక మోదీ, ట్రంప్ చర్చలపై తాజాగా వైట్‌హౌస్(White House) కూడా కీలక ప్రకటన చేసింది. మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించడంపైనీ చర్చ జరిగిందని తెలిపింది. రెండు దేశాల పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ట్రంప్, మోదీ చర్చించినట్లు అమెరికా అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. అమెరికా తయారు చేసిన ఆయుధాల కొనుగోళ్లను పెంచాల్సిన అవసరాన్ని భారత్‌కు విజ్ఞప్తి చేసినట్లు వైట్‌హౌస్ తెలిపింది. పారదర్శకమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పెంచాలని కూడా మోదీని ట్రంప్ కోరారని ప్రకటించింది. ఇరు దేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యంపైనా చర్చించినట్లు వివరించింది. ఈ ఏడాది భారత్‌లో క్వాడ్ సదస్సు నిర్వహణపై మోదీ, ట్రంప్ ఫోన్‌కాల్స్‌లో చర్చించారు. ఫిబ్రవరిలో అమెరికా రావాలని మోదీని ట్రంప్ ఆహ్వానించారు. ఈమేరు ఇద్దరూ వైట్‌హౌస్‌లో చర్చిస్తారని తెలిపింది.