
ఓవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు దొంగదెబ్బ కొడుతున్న చైనాతో అమీతుమీ తేల్చుకునేందుకే భారత్ సిద్ధమవుతోంది. సోమవారం రాత్రి భారత్-చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో 20మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెల్సిందే. జవాన్ల మృతిని భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈమేరకు భారత్ బహుముఖ వ్యూహాన్ని అవలంభిస్తోంది. సరిహద్దుల్లో మన సైన్యాన్ని మోహరించే భారత్ ను రెచ్చగొడితే చైనాకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తుంది. మరోవైపు చైనాతో ట్రేడ్ వార్ కు సిద్ధమవుతోంది. ఈనేపథ్యంలో చైనాకు చెందిన ఓ భారీ డీల్ ను కేంద్రం రద్దుచేస్తున్నట్లు ప్రకటించి ఆ దేశానికి తొలిషాకిచ్చింది.
సరిహద్దుల్లో దుస్సాసహసానికి దిగిన చైనాకు బుద్ది చెప్పాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఈమేరకు కేంద్రం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. భారత జవాన్ల త్యాగం వృథాకాదని భారత ప్రధాని మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన వెంటనే కేంద్రం పరోక్షంగా ట్రెడ్ వార్ కు సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్లో 5జీ అప్ గ్రేడ్ కాంట్రాక్ట్ పనుల్లో చైనా కంపెనీలకు కేంద్రం చెక్ పెట్టిన సంగతి తెల్సిందే. తాజాగా రైల్వే కాంట్రాక్టుల్లోనూ చైనా కంపెనీలకు కేంద్రం కోతపెడుతోంది.
ఈమేరకు చైనా కంపెనీకి ఇప్పటికే అప్పగించిన రైళ్ల సిగ్నలింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ల కాంట్రాక్ట్ పనులను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. గూడ్స్ రాళ్ల రాకపోకల కోసం కేంద్రం ప్రత్యేక కారిడార్ పనులు చేపడుతోంది. ఇందులో సిగ్నల్, టెలికమ్యూనికేషన్ కాంట్రాక్ట్ పనులను చైనాకు చెందిన బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్ డిజైన్ ఇన్ స్టిట్యూట్ సంస్థకు అప్పగించింది. ఈ కాంట్రాక్ట్ పనుల విలువ రూ.471 కోట్ల రూపాయలుగా తెలుస్తోంది. తాజాగా ఈ పనులను రద్దు చేస్తున్నట్టు రైల్వేశాఖ ప్రకటించి చైనాకు గట్టి షాక్ ఇచ్చింది.
వీటితోపాటు మరిన్ని చైనా కంపెనీ కాంట్రాక్టులన్నీ రద్దుచేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా చైనా వస్తువుల బహిష్కరణకు ప్రజలు పిలుపునిస్తుండగా మరోవైపు కేంద్రం కూడా చైనాతో ట్రేడ్ వార్ కు దిగడం ఆసక్తికరంగా మారింది.