
శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదం పొందకుండా చేసింది మీరంటే మీరని అధికార, ప్రతి పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మండలిలో జరిగిన పరిణామాలను క్యాష్ చేసుకోవాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అనూహ్య రీతిలో ద్రవ్య వినిమయ బిల్లుతో సహా ఐదు బిల్లులను ఆమోదించకుండానే శాసన మండలిని డిప్యూటీ ఛైర్మన్ నిరవధిక వాయిదా వేశారు. మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణుడు స్లిప్ రాసి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంకు పంపడంతోనే ఆయన సభను వాయిదా వేశారని అధికార పక్షం ఆరోపిస్తోంది.
మండలిలో టీడీపీ అనుసరించిన విధానం వల్ల ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదని, వచ్చే నెలలో ఉద్యోగులకు జీతాలు, సామాజిక ఫించన్లు చెల్లించడం సాధ్యం కాదని ఇందుకు టీడీపీ నాయకులే కారణమని శాసన మండలి సభా నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. స్వయంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి చేతులు జోడించి చెప్పినా డిప్యూటీ ఛైర్మన్, టీడీపీ ఎమ్మెల్సీలు వినిపించుకోకుండా మండలిని నిరవధిక వాయిదా వేశారన్నారు.
మరోవైపు శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుండా ఉండటానికి వైసీపీ మంత్రులే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆరోపించారు. ఆర్థిక మంత్రి బుగ్గన ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టేందుకు సిద్ధమై ఆయన సీటు నుంచి లేచి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెనక్కి లాగి ఆర్ధిక మంత్రి కూర్చో పెట్టారని తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం కంటే మంత్రులకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులే ముఖ్యం అయ్యాయని అందుకే ఈ పరిస్థితి నెలకొందన్నారు.
ఈ క్రమంలో సభలో జరిగిన గందరగోళానికి కారణం ఎవరనే విషయం తెలియాలంటే మండలిలో జరిగిన అంశాలను చిత్రీకరించిన వీడియో రికార్డులే ఆధారం. మండలి నిబంధనల ప్రకారం వీటిని బయటకు విడుదల చేసే అవకాశం లేదు. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి అనుకూలంగా వారు చెప్పుకుంటున్నారు. దీంతో సభలో ఎం జరిగిందనేది అంశంపై సర్వత్రా చర్చ జరుగుతుంది.