నిన్న మొన్నటి వరకూ చలిగాలులు, పొగమంచు దుప్పట్లు కప్పుకోగా.. ప్రస్తుతం భానుడి భగభగలు మొదలయ్యాయి. నాలుగు రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే వేసవి ఎలా ఉండబోతోందో ప్రారంభానికి ముందే సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా.. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనాలు దీనికి అనుగుణంగానే ఉన్నాయి. ఈ ఏడాది వేసవి కాలంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.
Also Read: మమతా బెనర్జీ హ్యాట్రిక్ కొట్టేనా..! : బెంగాల్ లో గెలుపెవరిది?
దేశంలోని వివిధ ప్రాంతాల్లో మార్చి–-మే మధ్య ఉష్ణోగ్రతలు ఎలా ఉండబోతున్నాయన్న అంచనాను ఐఎండీ వెల్లడించింది. ఉత్తర, ఈశాన్య భారత, తూర్పు, పశ్చిమ భారతంలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదవుతాయని పేర్కొంది. దక్షిణ, మధ్య భారత్‌లో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగానే ఉండొచ్చని వివరించింది. అయితే.. తూర్పు, పశ్చిమ సహా తీరాల ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించింది.
ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా తీర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ తెలిపింది. సాధారణం కంటే 0.5 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొంది. ఉత్తర భారతంలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే ఉండొచ్చని అంచనా వేసింది. సింధూ–-గంగా మైదానాలు పంజాబ్, హరియాణా, చండీగఢ్, ఢిల్లీ, తూర్పు, పశ్చిమ యూపీ, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ నుంచి ఒడిశా వరకు ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని తెలిపింది. చత్తీస్‌గఢ్, ఒడిశాలో సాధారణం కంటే 75 శాతం, మిగతా చోట్ల 65 శాతం అధికంగా ఉంటాయని పేర్కొంది.
Also Read: సంజయ్ చెప్పాల్సిన సీక్రెట్స్‌ను రేవంత్ చెప్పేశాడా..?
భూమధ్య రేఖ వద్ద పసిఫిక్ తీరంలో లానినా పరిస్థితులు ఉన్నాయని, మధ్య, తూర్పు భూమధ్యరేఖ పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. రాబోయే వేసవి కాలంలో లా నినా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తాజా మోడల్ సూచిస్తోంది అని వివరించింది. పసిఫిక్ తీర ప్రాంతంలో చల్లటి వాతావరణానికి లానినాతో సంబంధం ఉంది. ఎల్ నినో దాని సంశ్లేషణ. ఏప్రిల్–-జూన్‌కు సంబంధించిన అంచనాలను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్