Vizag Steel Plant : నెలకు 100, నాలుగు నెలలు ఇవ్వండి.. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం విరాళాలు

vizag steel plant: విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. గత మూడేళ్లుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, కార్మిక సంఘాలు, ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా పట్టించుకోవడమే మానేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం కూడా స్టీల్ ప్లాంట్ పోరాటంలో పెద్దగా భాగం కావడం లేదు. ఈ నేపథ్యంలో సిబిఐ మాజీ జెడి […]

Written By: NARESH, Updated On : April 15, 2023 10:35 pm
Follow us on

vizag steel plant: విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. గత మూడేళ్లుగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, కార్మిక సంఘాలు, ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పూర్తిగా పట్టించుకోవడమే మానేసింది. ప్రతిపక్ష తెలుగుదేశం కూడా స్టీల్ ప్లాంట్ పోరాటంలో పెద్దగా భాగం కావడం లేదు. ఈ నేపథ్యంలో సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సరికొత్త ప్రతిపాదన పెట్టారు. రాష్ట్ర ప్రజలంతా అలా చేస్తే స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవచ్చని ఆయన చెబుతున్నారు.

రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడున్నరేళ్లుగా ఉద్యమం సాగుతోంది. ఎంతోమంది బలిదానాలతో, త్యాగాలతో, ఆంధ్రుల ఆత్మాభిమానం నినాదంతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించ వద్దు అంటూ గడిచిన మూడేళ్ల నుంచి ఉద్యోగ, కార్మిక, ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రైవేటీకరణ పై ముందుకే సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను విక్రయించాలని నిర్ణయించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిడ్ వేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థను నిలబెట్టుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ సీఎంతోపాటు ఆ రాష్ట్ర మంత్రులు ప్రకటించారు. దీంతో ఇక్కడి ఉద్యోగ కార్మిక సంఘాలు ఆనందాన్ని వ్యక్తం చేశాయి.

బిడ్ల దాఖలకు శనివారంతో ముగిసిన గడువు..

వర్కింగ్ క్యాపిటల్, ముడి సరుకు కోసం విశాఖ ఉక్కు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్ల దాఖలుకు శనివారంతో గడువు ముగిసింది. అయితే గడువు తేదీని మరో ఐదు రోజులు పొడిగిస్తున్నట్లు ఆర్ఐఎన్ఎల్ ప్రకటించింది. దీనికి సంబంధించి మార్చి 21న విశాఖ ఉక్కు ప్రకటన విడుదల చేసింది. మార్కెటింగ్ శాఖకు మెయిల్, నేరుగా లేదా వ్యక్తుల ద్వారా ఈ వ్యాపారంతో ముడిపడి ఉన్న కంపెనీలు బిడ్లు దాఖలు చేయవచ్చని ప్రకటనలో పేర్కొంది. బిడ్లు దాఖలు చేసేవారు స్టీల్ వ్యాపారంలో ఉండాలని ప్రాథమిక అర్హతగా నిర్ణయించింది. మంచి భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నామన్న విశాఖ ఉక్కు ప్రకటన ప్రకంపనలు రేపింది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు బిడ్ల దాఖలు చేసేందుకు గడువు ముగిసింది. దాదాపు 22 బిడ్లు దాఖలైనట్లు సమాచారం. కార్మికుల ఆందోళన నేపథ్యంలో బిడ్ల దాఖలు గడువును మరో ఐదు రోజులు పొడిగించడం గమనార్హం.

సరికొత్త ప్రతిపాదన చేసిన మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ..

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా సాగుతున్న నేపథ్యంలో దీన్ని కాపాడుకునేందుకు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సరికొత్త ప్రతిపాదన చేశారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన ప్రకటించారు. ప్రైవేట్ కంపెనీ ద్వారా బిడ్ దాఖలు చేశారు ఆయన. ఉక్కు పరిశ్రమ సిజిఎం సత్యానంద్ కు బిడ్డింగ్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగు వారందరికీ బిడ్డ లాంటిదని, జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విశాఖ ప్రజల తరఫున తాను బిడ్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ కోసం కొత్త విధానం ద్వారా నిధులు సమీకరిస్తామన్నారు. క్రౌడ్ ఫండింగ్, డిజిటల్ ట్రాన్స్ఫర్ వంటి విధానాల ద్వారా నిధులు సేకరించే వెసులుబాటు ఉందన్నారు. 8.5 కోట్ల మంది నెలకు రూ.100 రూపాయల చొప్పున విరాళం ఇస్తే నెలకు రూ.850 కోట్లు జమ అవుతాయన్నారు. ఈ విధంగా నాలుగు నెలల పాటు చేయగలిగితే స్టీల్ ప్లాంట్ ను నిలబెట్టిన వాళ్లలో మనం ఉండే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. నాలుగు నెలలకు రూ.3400 కోట్లు వస్తే పరిశ్రమ నిలబడుతుందని తెలిపారు.