
Ponguleti Srinivas Reddy vs KCR : పొంగులేటి పంతం పట్టాడు. ఖమ్మం బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాడు. ఆయన మాటలకు కేసీఆరే సస్పెన్షన్ వేటు వేశాడు.. అయినా తగ్గకుండా అసమ్మతి రాజేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ కేసీఆర్ తనను చీట్ చేశాడని అంటున్నాడు. కేసీఆర్ న్యాయం చేయలేదు కాబట్టే తాను నిలదీశానని.. తనకు న్యాయం చేయాలని కోరానని.. కానీ తనకు నమ్మించి మోసం చేశారంటూ పొంగులేటి అభిప్రాయపడ్డాడు. తప్పు నాది ఏమాత్రం కాదు.. కేసీఆర్ దే నంటూ స్పష్టం చేశారు. అంతేకాదు.. కేసీఆర్ ను ఓడించేందుకు పెద్ద ప్లాన్ వేశాడు పొంగులేటి.
తనలాగా బీఆర్ఎస్ ను నమ్ముకొని కేసీఆర్ చేతిలో మోసపోయినా.. పోతున్న వారందరినీ ఒక్కగాటిన కట్టడానికి పొంగులేటి రెడీ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ చేతుల్లో దగపడ్డ వారిని ఏకం చేస్తానంటూ పొంగులేటి సంచలన ప్రకటన చేశాడు. కేసీఆర్ ను నమ్మి ఇప్పటికీ బీఆర్ఎస్ లో కొనసాగుతున్న వారిని కూడా సంప్రదించి నా దిశకు మారుస్తానని.. మేమంతా కలిసి కేసీఆర్, బీఆర్ఎస్ బాధితులుగా వచ్చే ఎన్నికల్లో పోరాడుతామంటూ తన ప్లాన్ ను పొంగులేటి బయటపెట్టారు.
కేసీఆర్ కు జ్ఞానోదయం అయ్యేలాగా ఆయనపై తాను పోరాటం చేస్తానంటూ పొంగులేటి స్పష్టం చేశారు. పొంగులేటి ప్లాన్లు చూస్తుంటే బీఆర్ఎస్ లో గుబులు రాకమానదు. ఎందుకంటే పొంగులేటి మాత్రమే కాదు.. బీఆర్ఎస్ లో చాలామంది ఇలానే కేసీఆర్ ఆశీర్వాదం దక్కక.. ఆయన పట్టించుకోక ఇప్పటికీ అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే పొంగులేటికి మద్దతుగా జూపల్లి రాగా.. ఇంకా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ క్రమంలోనే వారందరినీ పొంగులేటి ఏకం చేయడానికి రెడీ అయ్యారు. కేసీఆర్ ను మూడోసారి సీఎం కానివ్వమని.. మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు అవమాన భారంతో కృంగిపోతున్నారని.. వారందరినీ ఏకం చేసి కేసీఆర్ ను ఓడిస్తానంటూ పొంగులేటి శపథం చేశారు.
ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీని గెలవనీయమని.. ప్రతి నియోజకవర్గంలోనూ ఆ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతామంటూ పొంగులేటి ప్రకటించారు. కేసీఆర్ పతనం చూసేవరకూ నిద్రపోనన్నారు.
పొంగులేటి ప్లాన్లు కనుక నిజమైతే బీఆర్ఎస్ కు ఖమ్మంలోనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కష్టకాలమే. ఇప్పటికిప్పుడు ఇది జరగకపోయినా.. ఎన్నికల టైంకు వచ్చేసరికి ఈ అసంతృప్తి మరింతగా ప్రజ్వరిల్లి కేసీఆర్ సెగల తగలడం ఖాయమని అంటున్నారు.
