
జీహెచ్‌ఎంసీ 65 ఏళ్ల చరిత్రలో ఇప్పటివరకు గడువుకు ముందు ఎన్నికలు జరిగిన దాఖలాలు లేవు. గతంలో ఎంసీహెచ్‌గా ఉన్నప్పుడైనా.. జీహెచ్‌ఎంసీగా ఏర్పాటయ్యాక అయినా అలా జరగలేదు. ఎప్పుడైనా పాలకమండలి గడువు ముగిసి నెలలు, ఏళ్ల తరబడి ప్రత్యేక అధికారి పాలన కొనసాగేది. ఇప్పుడు భిన్నంగా పాలకమండలి పదవీ కాలం ఉండగానే ఎన్నికలకు కసరత్తు మొదలైంది. మహా నగరపాలక సంస్థలో ముందస్తు ఎన్నికలు కొత్తగా అనిపిస్తున్నాయని సీనియర్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: తెలంగాణ గ్రామీణం అతలాకుతలం..!
ఎంసీహెచ్ 1955లో ఏర్పాటైంది. అప్పటి నుంచి 1974 వరకు వరుసగా నాలుగు పాలకమండళ్లు కొలువుదీరాయి. 1969 పాలకమండలి 1974 వరకు ఉండగా.. అనంతరం 1986 వరకు ఎన్నికలు జరగలేదు. 1969 వరకు కూడా పాలకమండలి గడువు ముగిసిన తర్వాతే ఎన్నికలు జరిగాయి. 1974 నుంచి 86 వరకు దాదాపు 12 ఏళ్ల పాటు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. 1986లో తిరిగి ఎన్నికలు జరిగాయి. ఆ పాలకమండలి 1991 వరకు ఉంది. అనంతరం మరో 11 ఏళ్లు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 2002లో తిరిగి ఎంసీహెచ్ ఎన్నికలు నిర్వహించగా.. అప్పుడు ఎన్నికైన పాలకమండలి 2007 వరకు కొనసాగింది. శివార్లలోని 12 మునిసిపాల్టీలను విలీనం చేస్తూ ఏప్రిల్ 16, 2007న జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేశారు. గ్రేటర్ ఏర్పాటు అనంతరం రెండేళ్లకు 2009లో ఎన్నికలు జరిగాయి. 2009 నుంచి 2014 వరకు పాలకమండలి కొనసాగింది.
రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఏడాదిన్నర తర్వాత మళ్లీ 2016 ఫిబ్రవరి 2వ తేదీన ఎన్నికలు జరిగాయి. 2016 ఫిబ్రవరి 11న ప్రస్తుత పాలకమండలి కొలువుదీరింది. వీరి పదవీ కాలం ఫిబ్రవరి 10, 2021 వరకు ఉంది. కాగా.. నవంబర్ లేదా డిసెంబర్‌లోనే ఎన్నికల ప్రక్రియ ముగించే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ యాక్ట్ ప్రకారం పాలకమండలి గడువు ముగిసే మూడు నెలల ముందు ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉంది. ఈ వెసులుబాటు ఆధారంగానే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ముందస్తు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది.
ఈ నవంబర్ 10 నాటికే పాలకవర్గం గడువు మరో మూడు నెలలు ఉంటుంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ వెలువడుతుందనే సంకేతాలు వెలువడ్డాయి. చట్టంలోని వెసులుబాటు ఆధారంగా మూడు నెలల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారభమవుతున్నప్పటికీ కొత్త పాలకమండలి ఎప్పుడు కొలువుదీరుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఎంసెట్ ఆప్షన్ల నమోదులో అందుకే ఆలస్యం
ఎన్నికలు ముందు జరిగినా… నిర్ణీత టైం వరకు ప్రస్తుత పాలకమండలి కొనసాగే అవకాశం ఉంది. ఆ తరువాత కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయవచ్చు. అయితే.. మూడు నెలల ముందు ఇప్పుడున్న పాలకమండలిని రద్దు చేసే అధికారమూ ప్రభుత్వానికి ఉందని పలువురు అధికారులు చెబుతున్నారు. సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత పాలకమండలిని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తుందా..? లేక యథావిధిగా కొనసాగిస్తుందా..? అన్నది తేలాల్సి ఉంది.
ఈనెల 13, 14 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. గ్రేటర్ పాలకమండలి రద్దుకు సంబంధించి చట్ట సవరణకూ అసెంబ్లీలో ఆమోదం తెలిపే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. పాలకమండలి రద్దు చేసిన పక్షంలో కొత్త పాలకమండలి కొలువుదీరే వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతుంది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ప్రభుత్వం, ప్రతిపక్షాలు కూడా ఇప్పటి నుంచే ఎన్నికల బాట పట్టాయి. గ్రేటర్ వేదికగా రాజకీయాలు నడిపిస్తున్నాయి.
Comments are closed.