అమరావతి కేంద్రంగా రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు పోరాడుతున్నారు. ఇందులో భాగంగా దీక్షలు చేపట్టారు. దీక్షలు కొనసాగిస్తున్న కృష్ణాయపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ పర్యటించాడు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘అమరావతి ఉద్యమం 300వ రోజుకు చేరుకుంది. కేసులకు భయపడకుండా, కరోనాను లెక్క చేయకుండా ఉద్యమంలో పాల్గొన్న పెద్దలు, మహిళలకు నా నమస్కారాలు. ఇక్కడే రాజధాని ఉండాలని ఈ ప్రాంత ప్రజలు ఎవరూ కోరుకోలేదు. అన్ని ప్రాంతాలకు సమ దూరం ఉండాలని, 30 వేల ఎకరాలు కావాలని జగన్ రెడ్డి ఆనాడు చెప్పలేదా? ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడితే ఎలా? అధికారంలోకి వస్తే.. ఇంకా మరింత బాధ్యతతో జగన్ రెడ్డి ఉండాలి. పరిపాలన ఒకచోట, అభివృద్ధి అన్ని చోట్లా అని చంద్రబాబు చెప్పారు’ అని మాట్లాడుకొచ్చారు.
Also Read: అమరావతిపై విచారణ.. హైకోర్టులో కీలక వాదనలు
జగన్ రెడ్డి మూడు రాజధానల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు. అమరావతిలో ఒకే కులం అని అసత్యాలు ప్రచారం చేశారు. అన్ని కులాలు, మతాల సమ్మేళనమే రాజధాని అమరావతి. ఇంత వరద వచ్చింది.. ఎక్కడైనా ఒక్క ఎకరా మునిగిందా? రాష్ట్రం గురించి ఆలోచించి 30 వేలకు పైగా భూమి ఇచ్చారు. నేడు ఇలా రోడ్డెక్కి పోరాటం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. జగన్‌కు అనేక భవంతులు ఉన్నా… అమరావతిలో కట్టుకుని ఇక్కడే ఉంటామని నమ్మించారు. ఇప్పుడు ఈ తుగ్లక్ సీఎం, మెంటల్ సీఎం ప్రజలను మోసం చేశారు’ అంటూ విమర్శలు చేశారు.
విశాఖలో భూదందాల కోసమే విశాఖ రాజధాని అంటున్నారు. 17 నెలల కాలంలో ఒక్క అభివృద్ధి లేదు. ఒక్క పరిశ్రమ రాలేదు. రాష్ట్ర ప్రజలంతా ఒక్కసారి ఆలోచించండి. 300 రోజులుగా సాగుతున్న ఉద్యమానికి అందరూ మద్దతు ఇవ్వాలి. అమరావతిని కాదు.. మన గడ్డ మీద మొలిచిన గడ్డి కూడా జగన్ పీకలేరు. ఈ తుగ్లక్ పాలనను తరిమి కొట్టే వరకు ఓర్పు, సహనంతో మనం పోరాటం చేయాలి. న్యాయం కోసం పోరాడుతుంటే కేసులు పెడుతున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని జగన్ అనే వరకు పోరు ఆగకూడదు. ఇదే నినాదాన్ని సోషల్ మీడియా వేదికగా జనంలోకి తీసుకెళదాం. ఎంత సమయం పట్టినా సంయమనంతో.. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళదాం’’ అని పిలుపునిచ్చారు.
Also Read: జగన్ ఆరోపణలు దేశాన్ని ఓ కుదుపు కుదుపేసింది
కరోనా నుంచి సైలెంట్‌గా ఉండిపోయిన లోకెష్ ఒక్కసారిగా రెచ్చిపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఇటీవలే అమరావతికి చేరిన చంద్రబాబు క్యాడర్‌ను ఎవరినీ కలవలేదు. కానీ.. లోకేష్ ఒక్కసారిగా కృష్ణయపాలెంలో కనిపించారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు.