కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన ప్రారంభించింది. అన్ని స్టేట్లలో పార్టీ ప్రగతిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో నూతన పీసీసీ సారధులను నియమించి పార్టీని గాడిలో పెట్టాలని చూస్తోంది. పరిస్థితులను చక్కదిద్దే క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం తనదైన ముద్ర వేసేందుకు పావులు కదుపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా పీసీసీ చీఫ్ ను మార్చాలని చూస్తోంది. ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ గాఉన్న శైలజానాథ్ పార్టీని గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఆయనను మార్చి పార్టీని పరవళ్లు తొక్కించే వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది.
కొత్త పీసీసీ సారధిపై కసరత్తు చేస్తోంది. రాజకీయాల్ని యాక్టివ్ గా చేసే నేత కోసం అన్వేషిస్తున్నారు. పీసీసీకి ఓ రేంజ్ గల నేత కావాలని చూస్తున్నారు. గతంలో జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి పరిస్థితి బాగోక మళ్లీ కాంగ్రెస్ లో చేరిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని పీసీసీ సారధిగా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఏపీకి కొత్త సారధిగా పని చేస్తే బాగుంటుందని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డే కాంగ్రెస్ కు దక్కిన వరంలా భావిస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డిని సారధిగా చేస్తే పార్టీ ప్రతిష్ట కాస్తయినా గాడిలో పడుతుందని పలువురు ఆకాంక్షిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకుడు లేకపోవడంతోనే ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్నట్లు చెబుతున్నారు. సమర్థత గల నాయకుడు వస్తే పార్టీ మళ్లీ జవసత్వాలు వస్తాయని ఆశిస్తున్నారు. నావ నడిపే నాయకుడు లేకనే పార్టీ వెనుకంజలో పడిపోయిందని గుర్తు చేస్తున్నారు. పార్టీ ప్రతినిధుల కోరిక కూడా గమనించి సరైన నేతను నియమించి పార్టీని ముందుకు నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పీసీసీకి కిరణ్ కుమార్ రెడ్డి సరైన నేతగా సూచిస్తున్నారు. ఏపీలో పార్టీ నిలబడాలంటే ఆయన దిక్కని నమ్ముతున్నారు. అధిష్టానం కడా కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్నారు. ఆయన సారధ్యంలో కాంగ్రెస్ పార్టీ నూతనోత్తేజం పొందనున్నట్లు తెలుస్తోంది. దీంతో అందరు ముక్తకంఠంతో చెబుతున్నట్లుగా కిరణ్ కుమార్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.