Earthquake: తెలుగు రాష్ట్రాలను భూప్రకంపనలు వణికిస్తున్నాయి. ఇటీవల ఉత్తర తెలంగాణలోని మంచిర్యాల, పెద్ద పల్లి జిల్లాలను భూ ప్రకంపనలు భయపెట్టాయి. 4.0 తీవ్రతతో వచ్చిన భూకంపాలకు అన్ని ఊగి జనాలు భయంతో బయటకు పరుగులు తీశారు. తెలంగాణలో వారం కిందట వచ్చిన ఈ ప్రకంపనలు కలకలం రేపాయి.
ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. విశాఖ నగరంలో భూప్రకంపనలు సంభవించాయి. నగరంలోని పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. భూమి కంపించడంతో విశాఖ నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విశాఖలోని అక్కయ్యపాలెం, మురళీనగర్, బీచ్ రోడ్డు, కంచరపాలెం, మధురానగర్, తాడిచెట్ల పాలెం కొన్ని సెకన్ల పాటు భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయాందోళనకు గురైన జనాలు, తమ తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందోనని కాసేపు టెన్షన్ కు గురయ్యారు. దీనిపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.
విశాఖలో సంభవించినవి భూప్రకంపనలే అని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస భూప్రకంపనలు ఇప్పుడు జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.