MP Salary: మన ఎంపీల జీతమెంతో తెలుసా.. అలవెన్సులు అదనం..!

లోక్‌సభకు ఎన్నికైన ఎంపీకి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.లక్ష వేతనంగా ఇస్తుంది. అదనంగా నియోజకవర్గ ఖర్చుల కింద రూ.70 వేలు, కార్యాలయం ఖర్చు కింద రూ.60 వేలు అందుతాయి.

Written By: Raj Shekar, Updated On : June 12, 2024 9:13 am

MP Salary

Follow us on

MP Salary: మన దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు ఇటీవలే జరిగాయి. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 293, ఇండియా కూటమి 232 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి. లోక్‌సభ ఎంపీగా ఎన్నికైన వారు మనం చెల్లించే పన్నులతో వేతనం పొందుతారు. జీతంతోపాటు అలవెన్సులు కూడా ఉంటాయి. ప్రస్తుతం మన దేశంలో ఎంపీల జీతం ఎంత, వారికి లభించే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

= లోక్‌సభకు ఎన్నికైన ఎంపీకి కేంద్ర ప్రభుత్వం నెలకు రూ.లక్ష వేతనంగా ఇస్తుంది. అదనంగా నియోజకవర్గ ఖర్చుల కింద రూ.70 వేలు, కార్యాలయం ఖర్చు కింద రూ.60 వేలు అందుతాయి.

= ఎంపీలు, తమ భార్యతో కలిసి ఏడాదికి 34 సార్లు దేశీయంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా విమానంలో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు.

= వ్యక్తిగత, అధికారిక పర్యటనల కోసం రైళ్లలో ఫస్ట్‌ క్లాస్‌లో ఉచిత ప్రయాణం ఉంటుంది. తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తే ఇంధన ఖర్చును క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

= ఎంపీలకు వారి పదవీకాలంలో అద్దె రహిత వసతి కల్పిస్తారు. అధికారిక వసతి వద్దనుకుంటే నెలకు రూ.2 లక్షల హోం అలవెన్స్‌ అదనంగా చెల్లిస్తారు.

= ఎంపీలు, వారి కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎస్‌) కింద ఉచితంగా వైద్యం పొందవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రులు, ఈ పథకం వర్తించే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే చేరాలి.

= ఒకసారి మాత్రమే ఎంపీగా పనిచేసిన వారికి నెలకు రూ.25 వేల పింఛన్‌ లభిస్తుంది. ఆ తర్వాత కూడా ఎంపీగా గెలిస్తే.. పదవీ కాలం పూర్తయిన తర్వాత ఏటా నెలకు రూ.2 వేల పెంపు ఉంటుంది.

= ఇక ఏటా 1.5 లక్షల ఫోన్‌ కాల్స్‌ ఉచితంగా చేసుకునే సదుపాయం ఉంటుంది. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ వాడుకోవచ్చు. 50 వేల యూనిట్ల విద్యుత్, 4 వేల కిలో లీటర్ల నీరు ఉచితంగా పొందుతారు.