Nokia: కస్టమర్లకు నోకియా గుడ్ న్యూస్.. ఇకనుంచి 3D కాలింగ్ సదుపాయం

5G ఫోన్లు మార్కెట్ ను దున్నేస్తున్న క్రమంలో.. గత కొద్ది సంవత్సరాలుగా నోకియా పలు రకాల ప్రయోగాలు చేస్తోంది.. ఇందులో భాగమే I vas codec.. దీని ద్వారా యూజర్లు లైవ్ కాలింగ్ అనుభవం పొందే అవకాశం ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 12, 2024 9:17 am

Nokia

Follow us on

Nokia: ఇప్పుడంటే రకరకాల మోడల్స్ కస్టమర్ల చేతిలో కనిపిస్తున్నాయి. కొత్త కొత్త కంపెనీలు స్మార్ట్ ఫోన్లతో సందడి చేస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఫోన్ మార్కెట్ అంటే నోకియాదే. మార్కెట్లో ఆ కంపెనీదే గుత్తాధిపత్యం ఉండేది. కాలానికి తగ్గట్టుగా మారకపోవడం ఆ కంపెనీకి శాపం గా మారింది. పోటీ కంపెనీలు దూసుకురావడంతో క్రమేపి వెనక్కి వెళ్ళక తప్పలేదు. బౌన్స్ విత్ స్పీడ్ లాగా.. మార్కెట్ అవసరాలు, కస్టమర్ల ఆసక్తులను దృష్టిలో ఉంచుకొని నోకియా సరి కొత్తగా కనిపిస్తోంది. లేటుగా వచ్చిన లేటెస్ట్ అన్నట్టుగా.. ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో నోకియా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియో కాల్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన కస్టమర్ల కోసం Nokia 3D calling టెక్నాలజీని పరిచయం చేస్తోంది.. దీనిని నోకియా ప్రెసిడెంట్, సీఈవో పెక్కా లాండ్మార్క్ ప్రారంభించారు. ఈ టెక్నాలజీ గురించి ప్రపంచానికి వివరించారు. దీనిద్వారా తొలి కాల్ చేసిన వ్యక్తిగా ఆయన ఘనత సృష్టించారు. ” 3D calling అనేది కొత్త 3GPP ఇమ్మర్సివ్ వాయిస్, ఆడియో సర్వీస్ (I VAS) Codec కలబోత. ఇది సాధారణ మోనోపోనిక్ టెలిఫోనీకి చాలా భిన్నంగా ఉంటుంది. లైవ్ కాలింగ్ అనుభూతినిస్తుంది. ప్రస్తుతం మనం వినియోగిస్తున్న మోనోపోనిక్ స్మార్ట్ ఫోన్ వాయిస్ కాల్ 3D spatial sound తో నిజ జీవిత అనుభవాన్ని అందిస్తుంది.. దీనికి IVAS codec మరింత సహకరిస్తుందని” లాండ్ మార్క్ వివరించారు.

కొత్త కొత్త ప్రయోగాలు

5G ఫోన్లు మార్కెట్ ను దున్నేస్తున్న క్రమంలో.. గత కొద్ది సంవత్సరాలుగా నోకియా పలు రకాల ప్రయోగాలు చేస్తోంది.. ఇందులో భాగమే I vas codec.. దీని ద్వారా యూజర్లు లైవ్ కాలింగ్ అనుభవం పొందే అవకాశం ఉంటుంది.. ఇది ప్రస్తుతం టెస్టింగ్ దశ దాటి.. కాలింగ్ దశలోకి వచ్చేసింది. దీనిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు 3D కాల్ ప్రక్రియ నిర్వహించినట్టు నోకియా సీఈవో లాండ్ మార్క్ ప్రకటించారు.

3D స్పెటియల్ ఇమ్మర్సివ్ కాలింగ్ టెక్నాలజీ యూజర్లకు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే.. మనం మాట్లాడే వ్యక్తులు.. మన పక్కనే ఉన్న అనుభూతి కలుగుతుంది.. అలాంటప్పుడు దూరం అనే భావన ఉండదు. ప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఉన్నా.. 3D కాలింగ్ ద్వారా ఆ దూరాన్ని చెరిపేయవచ్చు. అంతేకాదు సరికొత్త కాలింగ్ అనుభూతిని పొందవచ్చు. అయితే ఈ టెక్నాలజీ ద్వారా మాట్లాడే మాటలను.. వీడియోను కూడా రికార్డు చేసుకొనే సౌలభ్యాన్ని కల్పించేందుకు నోకియా ప్రయోగాలు చేస్తోంది.