https://oktelugu.com/

India Vs USA: భారత్ కు ఎదురులేకున్నా.. అమెరికాతో అంత ఈజీ కాదు..

న్యూయార్క్ మైదానం డ్రాప్ ఇన్ పిచ్ కావడంతో భారత బ్యాటర్లకు ఇబ్బందికరంగా మారింది. భీకరంగా ఆడి.. వరదల పరుగులు చేయాలనుకుంటున్న భారత బ్యాటర్లు న్యూయార్క్ మైదానంపై తేలిపోతున్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : June 12, 2024 / 09:06 AM IST

    India Vs USA

    Follow us on

    India Vs USA: టి20 వరల్డ్ కప్ లో భాగంగా భారత జట్టు మరో కీలకమైన లీగ్ మ్యాచ్ ఆడనుంది. బుధవారం న్యూయార్క్ వేదికగా అమెరికాతో తలపడునుంది. గ్రూప్ – ఏ లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది రోహిత్ సేన. ఈ నేపథ్యంలో అమెరికాతో జరిగే మ్యాచ్లో గెలిచి సూపర్ -8 కు నేరుగా వెళ్ళిపోవాలని భావిస్తోంది.. మరోవైపు అమెరికా కెనడాపై సంచలన విజయం సాధించింది. పాకిస్తాన్ పై సూపర్ ఓవర్ దాకా వెళ్లి, ఉత్కంఠ మధ్య నెగ్గింది.. దీంతో తాము పసి కూనలం కాదని, కసితో ఆడేందుకే వచ్చామని అమెరికా ఆటగాళ్లు చాటి చెబుతున్నారు.

    పిచ్ పెద్ద సమస్య

    న్యూయార్క్ మైదానం డ్రాప్ ఇన్ పిచ్ కావడంతో భారత బ్యాటర్లకు ఇబ్బందికరంగా మారింది. భీకరంగా ఆడి.. వరదల పరుగులు చేయాలనుకుంటున్న భారత బ్యాటర్లు న్యూయార్క్ మైదానంపై తేలిపోతున్నారు. ఇదే సమయంలో బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేస్తుండడంతో ఇబ్బంది లేకుండా పోతోంది.. ముఖ్యంగా పాకిస్తాన్ పై 119 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం భారత బౌలర్ల నైపుణ్యానికి నిదర్శనం.. అయితే పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో 27 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయి, తడబాటును ప్రదర్శించింది. బౌలింగ్ కు అనుకూలంగా మారిన ఈ మైదానంపై భారత బ్యాటర్లు మెరుగైన పరుగులు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

    కోహ్లీ ఫామ్ లోకి రావాలి

    ఐర్లాండ్ పై ఒకటి, పాకిస్తాన్ పై నాలుగు పరుగులు చేసి నిరాశపరిచాడు విరాట్ కోహ్లీ. ఓపెనర్ పాత్రలో అతడు అంత ఈజీగా ఒదగలేక పోతున్నాడు. టి20 వరల్డ్ కప్ సాధనలో విరాట్ కోహ్లీ పాత్ర అత్యంత ముఖ్యమైనది. అలాంటప్పుడు అతడు తన పూర్వపు లయను అందుకోవాల్సి ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా వంటి వారు తమ బ్యాటింగ్ కు పదును పెట్టాల్సిన అవసరం ఉంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో రోహిత్ మినహా మిగతా వారంతా విఫలం కావడం.. అది జట్టు స్కోరుపై ప్రభావం చూపించింది. అలాంటి సన్నివేశాన్ని మరోసారి పునరావృతం చేయకూడదని భారత అభిమానులు కోరుకుంటున్నారు.

    అమెరికాను తీసి పారేయడానికి లేదు

    ఇక భారత్ జట్టు బలంతో పోలిస్తే అమెరికా ఏమాత్రం ఆనదు. వాస్తవానికి ఈ రెండు జట్ల మధ్య పోలిక కుదరదు. అయితే అలాగని అమెరికాను తీసిపారేయడానికి లేదు. టి20 వరల్డ్ కప్ కంటే ముందు అది బంగ్లాదేశ్ తో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ను గెలిచింది. పైగా అందులో ఉన్నది మొత్తం భారత క్రీడాకారులే కాబట్టి అటాకింగ్ ఆటను ప్రదర్శిస్తోంది. కెనడాపై రికార్డు స్థాయి చేదనతో ఆకట్టుకుంది. పాకిస్తాన్ పై చివరి వరకు పోరాడి.. సూపర్ ఓవర్లో విజయం సాధించింది.. అరోన్ జోన్స్, మోనాంక్ పటేల్ వంటి వారు సూపర్ ఫామ్ లో ఉన్నారు.. అయితే వారిని భారత బౌలర్లు ఎలా అడ్డుకుంటారనేది వేచి చూడాల్సి ఉంది. ఇక పెద్దపెద్ద బ్యాటర్ లను కూడా అడ్డుకున్న సామర్థ్యం తమకుందని పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లో అమెరికా బౌలర్లు నిరూపించారు. ఇక బుధవారం నాటి మ్యాచ్లో భారత్ పై ఎలా ఆడతారో చూడాల్సి ఉంది. పసి కూనే అని అమెరికాను భారత్ తేలికగా తీసుకుంటే షాక్ తప్పదు. ఇక ఈ మ్యాచ్లో టీమిండియా ఎటువంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఇక క్రికెట్లో ఏ ఫార్మాట్లోనైనా భారత్, అమెరికా పరస్పరం తల పడటం ఇదే మొదటిసారి.

    తుది జట్ల అంచనా ఇలా

    భారత్

    రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, సిరాజ్, విరాట్ కోహ్లీ, అక్షర్ పటేల్, బుమ్రా, రవీంద్ర జడేజా, శివం దూబే, అర్ష్ దీప్ సింగ్.

    అమెరికా

    మోనాంక్ పటేల్( కెప్టెన్), స్టీవెన్ టేలర్, గౌస్, జోన్స్, నితీష్ కుమార్, అండర్సన్, హర్మీత్ సింగ్, జస్ దీప్ సింగ్, కెంజిగే, సౌరభ్ నేత్రావల్కర్, అలీ ఖాన్.