Differences YCP Leaders in Vijayanagaram: విజయనగరం వైసీపీలో ముసలం మొదలైంది. పార్టీనేతల ఏకపక్ష ధోరణికి నిరసనగా అనేకమంది నేతలు, కార్యకర్తలు ఏకంగా పార్టీని వీడిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వలసపక్షులన్నీ తెలుగుదేశం గూటికి చేరడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ఇంకా బోలెడు సమయం ఉన్నప్పటికీ వైసీపీనుంచి వలసలు పెరిగిపోవడం అధికార పార్టీలో వణుకు పుట్టిస్తోంది. విజయనగరం జిల్లా తొలి నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోట. కానీ.. 2019లో వైసీపీ ప్రభంజనం ముందు తెలుగుదేశం వెలవెలబోయింది. దీని తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగింది. ఇక ఈ మూడేళ్ళు జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. మరో రెండేళ్ళు వైసీపీనే అధికారంలో ఉంటుంది. కానీ ఇటీవల ఆ పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. వైసీపీలో ఉక్కపోత కారణంగా నేతలు, కార్యకర్తలు ఒక్కొక్కరూ వలసబాట పడుతున్నారు.
టీడీపీలో భారీగా చేరికలు
సాధారణ ఎన్నికల ముందు వలసలు సహజం. కానీ విజయనగరంలో అప్పుడే చోటు చేసుకోవడమే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. చాలామంది వైసీపీ కార్యకర్తలు పోలోమంటూ తెలుగుదేశంలోకి చేరిపోతున్నారు. కేవలం పదిహేను రోజుల వ్యవధిలోని విజయనగరంలోని మూడు వార్డులకు చెందిన పలువురు నాయకులతో పాటు కీలక కార్యకర్తలు పసుపు జెండా నీడన చేరారు. వీరంతా పదవులు ఆశించటానికి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లేవు..! పనులు జరిపించుకోవటానికి అనుకుంటే చేరుతున్నది ప్రతిపక్షంలో..! పోనీ ఇక్కడి వైసీపీ నాయకుడు బలహీనమైన వ్యక్తా అనుకుంటే అదీ కాదు..! మరి వీరంతా టీడీపీలోకి ఎందుకు చేరుతున్నారనే ప్రశ్న అధికార పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులను తొలిచేస్తున్నా.. కీలక నేతకు మాత్రం స్పష్టత వుందని తెలుస్తోంది. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోని అసమ్మతి గళాలు ఉండటం సహజమే.. అందుకే కోలగట్ల దెబ్బకు విలవిల్లాడుతున్న వారంతా ఇప్పుడు తమ దారి తాము చూసుకుంటున్నారుట. అందుకే తెలుగుదేశం నుంచి ఎటువంటి ఒత్తిడి లేకపోయినా వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీ పంచన చేరుతున్నారు.
నేతలే కాదు వారి వెనుక భారీగా కార్యకర్తలు కూడా పసుపు కండువాలు కప్పుకుంటున్నారు. బాబామెట్ట, పూల్ బాగ్ కాలనీకి చెందిన వైసీపీ అసమ్మతివాదులు ఏకంగా రెండు బస్సులతోపాటు మోటారు సైకిల్ ర్యాలీతో తెలుగుదేశం నేత అశోక్ వద్దకు వచ్చి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయ్యన్నపేటకు చెందిన వైసీపీ తిరుగుబాటు అభ్యర్ధి మజ్జి త్రినాధ్ యాభై కుటుంబాలతో కలసి అశోక్ గజపతిరాజే తమ నాయకుడని ప్రకటించారు. ఇక 12వ డివిజన్‌కి చెందిన ఇప్పిలి రామారావు వంద కుటుంబాలతో వారం రోజుల క్రితమే టిడిపిలో చేరిపోయారు. ఇంతకు మూడింతల మంది టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని అశోక్ గజపతిరాజు బంగ్లా వర్గాలభోగట్టా..! అయితే టీడీపీలో చేరుతున్న వారంతా వైసీపీ పని అయిపోయిందని, సంక్షేమపథకాలు ఆ పార్టీని గెలిపించలేవని ఓ పక్క చెపుతూనే ఎమ్మెల్యే వీరభద్రస్వామి ఏకపక్ష ధోరణితో కూడా పడలేకపోతున్నామంటున్నారు.
బొత్స ఇలాకాలో..
విజయనగరంలో ఇలా ఉంటే మంత్రి బొత్స అడ్డా అయిన చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలం కుమరాంకు చెందిన సర్పంచ్ ముల్లు రమణ భారీ ర్యాలీతో 120 కుటుంబాలను టిడిపిలో కలిపేశారు. వీరిని చూసి వందలాది మంది వైసీపీ కార్యకర్తలు కూడా పసుపు చొక్కాలు తొడిగేశారు. ఏదేమైనా అధికార పార్టీని కాదని ఈ సందర్భంలో టీడీపీలో చేరటం అంటే అంత ఆషా.. మాషీ కాదని.. మరో ఆరు నెలలు ఆగితే ఈ చేరికలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అసలు టీడీపీ ప్రయత్నించడం లేదుకానీ… కొద్దిగా దృష్టిపెడితే వైసీపీని వీడేందుకు ఇంకా చాలామంది సిద్ధంగా ఉన్నారని ఫ్యాన్ పార్టీ వర్గాల ఇన్‌సైడ్ టాక్. మరి వైసీపీ ఈ వలసలను ఎలా కంట్రోల్ చేస్తుందో చూడాలి.
Also Read:JanaSena Party: జనసేన అధికారంలోకి రావడానికి ఉన్న మూడు ఆప్షన్లేంటి?