Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటోందా అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. వరంగల్ సభ తర్వాత పార్టీపై ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని, రైతురచ్చబండ కార్యక్రమాల ద్వారా వరంగల్ రైతు డిక్లరేషన్‌ను ప్రజలల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించామని పేర్కొంటున్నారు. బీజేపీది వాపు తప్ప బలం లేదన్న నిర్ధారణకు కాంగ్రెస్‌న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోగలిగితే తమదే అధికారమని భావిస్తున్నారు. తెలంగాణపై పార్టీ అధినాయకత్వం కూడా ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ పార్టీ హైకమాండ్ ప్రత్యేక సర్వే చేయిస్తూ తప్పొప్పులను పార్టీ రాష్ట్ర నేతలకు ఎప్పటికిప్పడు తెలియజేస్తుంది. ప్రధానంగా ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ ను నియమించుకోవడంతో ఆయన బందం ఇప్పటికే రెండుసార్లు సర్వే చేసినట్లు సమాచారం.
రేవంత్ బాధ్యతలు చేపట్టిన తర్వాత…
ప్రధానంగా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ బాధ్యతలను చేపట్టిన తర్వాత పార్టీలో కొంత ఊపు కన్పిస్తుంది. ముఖ్యంగా యువతలో కొంత ఊపు కన్పిస్తుంది. తొలినాళ్లలో కొంత సీనియర్లు వెనక్కు లాగినా హైకమాండ్ వైఖరిని చూసి వెనక్కు తగ్గి రేవంత్‌కు సహకరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతానికి ఐక్యంగా కన్పిస్తున్నారు. ఇదే ఐక్యత ఎన్నికల వరకూ కొనసాగించాలన్నది హైకమాండ్ ఆలోచన. అందుకే టిక్కెట్ల కేటాయింపు బాధ్యతను కూడా హైకమాండ్ తీసుకుంది. ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోందది.
నేతల ఐక్యతారాగం
జూన్ 1, 2వ తేదీల్లో జరిగిన నవసంకల్ప్ చింతన్ శిబిర్‌లో కూడా పార్టీ నేతల్లో ఐక్యత కన్పించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లేకపోయినా మల్లు భట్టివిక్రమార్క నేతృత్వంలో చింతన్ శిబిర్ సక్సెస్ అయిందనే చెబుతున్నారు. బీజేపీకి 119 నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం లేదు. కాంగ్రెస్‌కు అలా కాదు. ప్రతీ నియోజకవర్గంలో బలమైన నేతతో పాటు, క్యాడర్ ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉంది. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒకసారి అవకాశం ఇవ్వాలని జనంలోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు.
ప్రభుత్వ నిర్ణయాలపై పోరాటం..
రైతు డిక్లరేషన్ తో పాటు ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పార్టీ భావిస్తుంది. రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత పాదయాత్ర తేదీలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముందని తెలిసింది. అధికార టీఆర్‌ఎస్ ఎనిమిదేళ్లు పాలనపై అసంతప్తితో ఉన్న వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. సామాజికవర్గాలుగా తమ వైపు మళ్లించేందుకు వ్యూహాలను రచిస్తుంది. ఒక సామాజికవర్గం ఇప్పటికే కాంగ్రెస్ కు దగ్గరయిందన్న వార్తలు వెలువడుతున్నాయి. మరో సామాజికవర్గం కూడా రేవంత్ ను చూసి కొంత సానుకూలతతో ఉంది. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన సామాజికవర్గాలు దగ్గరవుతుండటంతో కాంగ్రెస్‌లో ఆశలు మరింత పెరిగాయి. కాంగ్రెస్ నేతలు ఇదే ఐక్యతను కొనసాగిస్తే అధికారపార్టీని నిలువరించడం పెద్ద కష్టమేమీ కాదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Also Read:CM Jagan Decisions: జగన్ నిర్ణయాలు కొంపముంచుతాయి? ఆ తప్పుతోనే అథ:పాతాళానికి?