
తెలుగు రాష్ట్రాల ప్రజలు మిడతల దండు పేరు చెబితేనే వణికిపోతుండగా అక్కడ మాత్రం వాటిని ఏకంగా బిర్యానీ చేస్తున్నారు. మిడతలు దాడి నుంచి ఎలా తప్పించుకోవాలనేదిపై రాష్ట్ర ప్రభుత్వాలు మీటింగుల మీద మీటింగు పెట్టి మరీ చర్చిస్తున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈమేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అనుబంధ, ఫారెస్టు అధికారులను అప్రమత్తం చేశారు. కాగా మిడతల దండు పాకిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశించాయి. రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో వేలాది ఎకరాల్లో పంటలను నాశనం చేశాయి. డీజే సౌండ్లు, రసాయనాలు చల్లి వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మిడదల దండు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేశాయి. దీంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.
ఇదిలా ఉంటే తమ పంటల పొలాలను, ఆహార ధాన్యాలను ఖతం చేస్తున్న మిడతలపై రాజస్థానీయులు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఈ మిడతలతోనే స్థానిక రెస్టారెంట్లలో బిర్యానీ, వేపుళ్లు, కూరలు వండటం చేస్తున్నారు. ‘మకాడ్ బిర్యానీ’ పేరుతో ధార్, జైపూర్ రెస్టారెంట్లలో అమ్మకాలు చేపట్టారు. ఒక్కో ప్లేటు బిర్యానీని రూ.200కు విక్రయిస్తుండటం విశేషం. తొలుత పాకిస్థాన్‌లో మిడతలను స్నాక్స్‌లా తయారుచేశారు. ఆ తర్వాత బిర్యానీ చేయడం ప్రారంభించారు. దీనికి ‘మాక్ బిర్యానీ’ అని పేరుపెట్టారు. ఒక ప్లేటు రూ.300లు పలుకుతోంది. వీటిని పాకిస్థానీయులు వీటిని లోట్టలేసుకొని తింటున్నారు
పాకిస్థాన్లోని బిర్యానీ చూశాకే రాజస్థాన్లోనూ బిర్యానీ చేయడం ప్రారంభించారు. వీటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో టెస్టీగా ఉంటాయని రెస్టారెంట్ నిర్వహకులు చెబుతున్నారు. కొందరు మిడతలతో తయారుచేసిన వంటకాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అందనీ ఆహారాన్ని మిడతలు కబళిస్తుంటే వాటినే మనోళ్లు బిర్యానీగా చేస్తుండటం విశేషం. ఈ విషయం చైనా వాళ్లు తెలిసిందంటే రకరకాల వంటకాలతో మిడతలను భూమ్మీద లేకుండా చేయడం ఖాయమని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్రెండ్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ మిడతల బిర్యానీ కనువిందు చేయడం ఖాయంగా కన్పిస్తుంది. ఈ విషయం మిడతలకు తెలిస్తే ఇటూవైపు కన్నెత్తి కూడా చూసేవీ కాదేమో..!