Dalitha Girijana Dandora Sabha: టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాక నేతల్లో జోరు పెరిగింది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మొదటి సభ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించి విజయం సాధించి పార్టీలో ఊపు తెచ్చింది. రెండో సభ మహేశ్వరంలో జరిపి పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఇక మూడో సభ మేడ్చల్ జిల్లాలో కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతల పల్లిలో నిర్వహించి అధికార పార్టీకి సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్ ప్రస్తుతం మంచి పట్టు కోసం ప్రయత్నాలు చేస్తోంది.
అధికార పార్టీ విధానాలు ఎండగట్టడంలో కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దళిత, గిరిజన దండోరా సభల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం అన్ని అస్రాలను సిద్దం చేస్తోంది. ఇప్పుడు దళిత గిరిజన దండోరా సభను ఘనంగా నిర్వహించే బాధ్యతను మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహకు అప్పగించారు. సభ సజావుగా జరిపేందుకు రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను పెద్దఎత్తున తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ వ్యవహారాల కమిటీ వేసిన సందర్భంలో ఇప్పుడు సభ నిర్వహణపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ఫ్లెక్సీల ఏర్పాటులో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారని తెలుస్తోంది. అయితే పోలీసులు సభ కోసం అనుమతి ఇచ్చారు. కానీ కాంగ్రెస్ శ్రేణుల బైక్ ర్యాలీ మాత్రం వంటిమామిడి నుంచి తీసేందుకు నో చెప్పారు.
దళిత, గిరిజన దండోరా సభకు శుక్రవారం 3 గంటల నుంచి 8 గంటల వరకు జరిపేందుకు అనుమతి ఇచ్చారు. సభ నిర్వహణపై రేవంత్ రెడ్డి కూడా తనదైన శైలిలో కాంగ్రెస్ నాయకులపై ఉన్న కేసులను కొట్టేస్తామని చెప్పడంతో నేతల్లో ఊపు కనిపిస్తోంది. సభ కోసం జనాన్ని తరలించేందుకు తయారవుతున్నారు. గజ్వేల్ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం అవుతున్నారు. ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఎండగట్టే క్రమంలో అందరు కలిసి రావాలని కోరుతున్నారు.