దేశంలో కమ్యూనిస్టుల కోటలు బీటలు వారాయి. పశ్చిమ బెంగాల్ లో సుదీర్ఘ కాలం అధికారం చేపట్టిన కమ్యూనిస్టులు ప్రస్తుతం అన్ని కోల్పోయారు. ఒక్క కేరళలోనే పట్టు సాధించి అధికారం చేజిక్కించుకున్నారు. వారి విధానాలే వారిని అధికారానికి దూరం చేశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ వారు పట్టుదలలో మూర్ఖులనే నానుడి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కేరళలో ప్రభుత్వాన్ని నడిపే పినరయ్ విజయన్ తనదైన శైలిలో పరిపాలన చేస్తున్నారు. అందరి ప్రజల ఆదరాభిమానాలు పొందుతూ రాష్ర్టం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.
కేరళను అటు కరోనా, ఇటు వరదలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ర్టంలో కరోనా కేసులు తగ్గడం లేదు. రోజువారీగా ఇరవై నుంచి ముప్పైవేల పైనే కేసులు నమోదు కావడం తెలిసిందే. అయినా విజయన్ ఆందోళన చెందడం లేదు. దాని నివారణకు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. దాదాపు మూడు లక్షల కోట్ల అప్పులు చేసి మరీ పరిపాలన వ్యవహారాలు కొనసాగిస్తున్నారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్న సందర్భంలో చాలా ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ఉంది. దీన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో రాష్ర్ట ప్రభుత్వంపై కూడా అప్రదిష్ట పడనుంది. దీంతో జగన్ మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. కానీ కేరళలో ఉన్న బీహెచ్ ఈఎల్ సంస్థను కూడా కేంద్రం ప్రైవేటీకరించాలని చేస్తున్న ప్రయత్నాలను తనదైన శైలిలో అడ్డుకున్నారు.
కేరళలోని కాసరగూడ జిల్లాలో ఉన్న బీహెచ్ ఈఎల్-ఈఎంఎల్ సంస్థను పినరయ్ విజయన్ రక్షించుకున్నారు. దీన్ని రాష్ర్ట ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని కేంద్రం పన్నాగాలను పక్కన పెట్టేశారు. ఈ నేపథ్యంలో రూ.77 కోట్లు ఖర్చు చేసి మరీ దాన్ని కేంద్రం గుప్పిట్లోకి పోకుండా చర్యలు తీసుకున్నారు. ఉద్యోగులకు బకాయి పడిన రూ.14 కోట్లు సైతం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసి కంపెనీని కాపాడుకున్నారు. దీంతో విజయన్ చర్యను అందరు ప్రశంసిస్తున్నారు. అన్ని ప్రాంతాలు ఇలాగే చేసి సంస్థలను కాపాడుకోవాలని భావిస్తున్నారు.