ఏపీ సీఎం జగన్ మరో అద్భుతమైన పథకం ప్రారంభించారు. జగనన్న చేదోడు కార్యక్రమం కింద నాయిబ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు పదివేల రూపాయల ఆర్దిక సాయం చేస్తూ ముఖ్యమంత్రి జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేశారు. జగన్ మాట్లాడుతూ తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. మ్యానిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను భగవద్గీత, ఖురాన్, బైబిల్ గా భావిస్తానని పునరుద్ఘాటించారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు.
సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన చెప్పారు.3.58 కోట్ల మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించామని ముఖ్యమంత్రి చెప్పారు.