CM Jagan- Early Elections: ఏపీ సీఎం జగన్ ముందస్తుకు వెళుతున్నారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మందస్తుకు వెళితేనే మేలని భావిస్తున్నారా? వచ్చే ఏడాది తెలంగాణ ఎన్నికలతోనే ప్రజా క్షేత్రంలో వెళ్లాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. గత మూడేళ్లుగా లేని విధంగా వరుసగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తుండడం అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పార్టీ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిస్తుండడంతో ఎట్టి పరిస్థితుల్లో జగన్ ముందస్తుకు వెళతారన్న ప్రచారం జోరందుకుంటుంది. ఇప్పటికే ఆయన వివిధ సర్వేలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. సానుకూల పరిస్థితులు కనబడుతుండడంతో ఆరు నెలల ముందగానే ఎన్నికల గోదాలోకి దిగుతారన్న టాక్ నడుస్తోంది. అయితే సర్వేలో ఏం తెలిందో ఏమో కానీ.. ఇటీవల ఆయన స్వరం మారింది. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను స్వీప్ చేస్తామన్న ధీమా మాత్రం కనిపిస్తోంది. అటు పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపేందుకో.. లేక వారిని అప్రమత్తం చేసేందుకో కానీ జగన్ నోటి నుంచి వ్యాఖ్య తరచూ వినిపిస్తోంది. ఇటీవల ఎమ్మెల్యేలకు రెండో సారి వర్కుషాపు నిర్వహించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమ నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. ప్రజలను నేరుగా కలుసుకొని సమస్యలు తెలుసుకోవడం, వాటికి పరిష్కార మార్గం చూపడం ద్వారా వారి అభిమానాన్ని చూరగొనాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా తాను, ప్రజల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం ద్వారా మీరు మంచి పాలకులుగా పేరు తెచ్చుకుందామని కూడా జగన్ ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు.
నేడు కీలక సమావేశం,…
క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్న సీఎం జగన్ శుక్రవారం పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు,. జిల్లా అధ్యక్షులతో సమావేశం కానున్నారు.రెండు నెలల కిందటే వారితో సమావేశమైన జగన్ వారికికొన్ని సూచనలిచ్చారు. నిపుణులతో సలహాలు, సూచనలు ఇప్పించారు. ఇప్పుడు మరోసారి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. సమావేశానికి హాజరుకావాలని రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులకు సమాచారం అందించారు. పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయడం ఎలా? వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారితో జగన్ చర్చించనున్నారు.
Also Read: CPI Narayana Comments On Chiranjeevi : నారాయణ.. నారాయణ.. ఏమీ నీ దిగజారుడు మాటలయ్యా!
జిల్లాల్లో నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులు, లోటుపాట్లు తెలుసుకోనున్నారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా గుర్తించిన అంశాలతో ఒక అజెండా రూపొందించారని.. ఈ సమావేశంలో దానిపైనే చర్చిస్తారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. తిరుపతి లోక్ సభ, బద్వేలు, ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల్లో పార్టీ గెలుపు ఫార్ములాను తీసుకొని వచ్చే ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావిస్తున్నారు. దీనికి సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులకు దిశా నిర్దేశం చేయనున్నారు. 175 నియోజకవర్గాల్లో గెలుపుపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు.
క్షేత్రస్థాయిలో విభిన్న పరిస్థితులు…
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 175 నియోజకవర్గాల్లో స్వీప్ చేయడం సాధ్యమేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గడిచిన ఎన్నికల నాటి పరిస్థితులు అసలు కనిపించడం లేదు. గతంలో వైసీపీతో కలిసి నడిచిన చాలావర్గాలు దూరమయ్యాయి. సంక్షేమం మాటున అభివృద్ధిని దూరం చేశారని విద్యాధికులు, మేధావివర్గం తప్పుపడుతోంది. మూడేళ్లకే ఏ ప్రభుత్వానికి రాని ప్రజా వ్యతిరేకత జగన్ మూట గట్టుకున్నారు. కనీసం అభివృద్ధి అన్న ఆనవాళ్లు కనిపించలేదు. అటు సొంత పార్టీలో సైతం విభేదాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అటు టీడీపీ కూడా యాక్టివ్ అయ్యింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి దిశగా అడుగులేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ నిరాకరణ చేయడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికల నాటికి విపక్ష కూటమి వైపు మాత్రం బీజేపీ అడుగులేస్తే జగన్ మరింత ఇరకాటంలో పడతారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదని.. అందుకే 175 సీట్లను గెలుస్తామన్న కొత్త పల్లవిని అందుకున్నారని విపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.