Chandrababu Family: ఈసారి గట్టిగా కొట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. 2024 ఎన్నికలు టిడిపికి చావో రేవో అన్న మాదిరిగా మారడంతో సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇందుకుగాను కుటుంబ సభ్యులను రంగంలోకి దించారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేశారు. ఏకకాలంలో ముగ్గురు రాష్ట్రాన్ని చుట్టేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే భువనేశ్వరి ప్రజల మధ్యకు వచ్చారు. ఆమె రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగించనున్నారు. అటు లోకేష్ సైతం తాను పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక ఫోకస్ పెట్టారు.
ఈ నెలలోనే రాష్ట్రంలోని 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో పర్యటించాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. 24 రోజుల్లో 25 బహిరంగ సభల్లో పాల్గొనాలని నిర్ణయించారు. ఈ మేరకు బహిరంగ సభల షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలు కవర్ అయ్యేలా ఈ బహిరంగ సభలు ఏర్పాటు చేయడం విశేషం. ఈ సభల ద్వారా టిడిపి తో పాటు జనసేన కేడర్ కు చంద్రబాబు దిశా, నిర్దేశం చేయనున్నారు.మరోవైపు సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు పై సైతం దృష్టి పెట్టనున్నారు.
మరోవైపు మంగళగిరిలో లోకేష్ పర్యటిస్తున్నారు. సంక్రాంతి వరకు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలను లోకేష్ తిరగనున్నారు.స్థానిక నాయకులు, క్యాడర్ తో మండలాల వారీగా లోకేష్ సమీక్షించనున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయనున్నారు. గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేష్ ఓడిపోయారు. ఈసారి కూడా లోకేష్ ను ఎలాగైనా ఓడించాలని జగన్ భావిస్తున్నారు. బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని రంగంలోకి దించారు. దీంతో లోకేష్ అప్రమత్తమయ్యారు. నియోజకవర్గ వ్యాప్తంగా తటస్తులను కలుసుకొని మద్దతు కూడగడుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి పేరిట నారా భువనేశ్వరి పరామర్శలకు దిగిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు సుదీర్ఘ కాలం పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో మనస్థాపానికి గురైన చాలామంది టీడీపీ అభిమానులు ప్రాణాలు వదిలారు. వారిని పరామర్శించేందుకు నిజం గెలవాలి పేరిట భువనేశ్వరి అన్ని జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించారు. చనిపోయిన వారి కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. సరిగ్గా విజయనగరం జిల్లాలో ఆమె ఉండగా చంద్రబాబుకు బెయిల్ లభించింది. దీంతో అప్పట్లో యాత్రను నిలిపివేసి రాజమండ్రి చేరుకున్నారు. ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రలో పరామర్శ యాత్రను ప్రారంభించారు. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో బాధిత కుటుంబాల వారిని పరామర్శించనున్నారు.
అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు కుటుంబ సభ్యులను రంగంలోకి దించడం విశేషం. కుటుంబం మొత్తం ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. గత ఎన్నికలకు ముందు జగన్ ఇదే మాదిరిగా కుటుంబం మొత్తాన్ని రంగంలోకి దించారు. ఇప్పుడు దానిని గుర్తు చేస్తూ చంద్రబాబు ఫ్యామిలీ మొత్తాన్ని రంగంలోకి దించి ప్రజా మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తుండడం విశేషం. అయితే ఈ ప్రయత్నంలో చంద్రబాబు ఎంతవరకు సఫలీకృతులు అవుతారో చూడాలి.అయితే జనసేన తో పొత్తు నేపథ్యంలో రెండు పార్టీల శ్రేణులు ఉరకలేసిన ఉత్సాహంతో పని చేస్తుండడం విశేషం.