ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిపక్ష పార్టీ నాయకుల అరెస్టుల పర్వానికి తెరలేపింది. స్వల్ప వ్యవధిలో టీడీపీ కి చెందిన ఇద్దరు బడా నాయకులు అరెస్టు అయ్యారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు అచ్చెన్నాయుడుని ఈ ఎస్ ఐ కుంభకోణం కేసులో సి బి ఐ అరెస్ట్ చేసింది. అలాగే అనంతరపురం మాజీ ఎంఎల్ఏ జె సి ప్రభాకర్ రెడ్డి మరియు అతని కుమారుడు అస్మిత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ లు వైసీపీ ప్రతీకార చర్య, ప్రతిపక్షాన్ని అణచివేసే ఎత్తుగడ అని టీడీపీ నాయకులు మీడియా వేదికగా గగ్గోలు పెడుతున్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయంలో బి సి కార్డు తెరపైకి తెచ్చి బీసీ నాయకులతో జగన్ పై గట్టి విమర్శలు చేయించారు. ఫలితం మాత్రం శూన్యం అని చెప్పాలి.
మరో వైపు అమరావతి రాజధాని భూముల విషయంలో జరిగిన అవకతవకలతో సంబంధం ఉన్న అధికారుల అరెస్టులు జరుగుతున్నాయి. టీడీపీ అనుకూల మీడియా ఈ విషయాలపై ఎంత గోల చేసినా, ప్రజల్లో టీడీపీ పై సానుభూతి వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ మరింత దూకుడు నిర్ణయాలు తీసుకొనే ఆస్కారం లేకపోలేదు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న అనేక మంది నాయకుల అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం ఉంది. మరో వైవు నారా లోకేష్ రేపు నన్ను కుడా అరెస్ట్ చేస్తారు అని, గట్టిగా చెవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆలస్యం చేయకుండా జగన్ కి చెక్ పెట్టాలనేది చంద్రబాబు ఆలోచన. కానీ 23 మంది ఎంఎల్ఏ లు ఇద్దరు ఎంపి లతో చంద్రబాబు జగన్ ని ఎదుర్కోవడం అనేది జరగని పని. ఈ తరుణంలో చంద్రబాబుకి కనిపిస్తున్న ఒకే ఒక ఆశాకిరణం బీజేపీ. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రమే జగన్ ని కంట్రోల్ చేయగలదని చంద్రబాబు భావిస్తున్నాడు. అందుకే ఆయన బీజేపీ తో స్నేహానికి పైరవీలు మొదలుపెట్టారని తెలుస్తుంది. ఇటీవల ఆయన వ్యాఖ్యలు ఇందుకు ఊతం ఇస్తున్నాయి. ఎన్నికలకు ముందు మోడీపై అగ్గిపై గుగ్గిలం అయిన బాబు, రెండు రోజుల క్రితం మోడీతో వ్యక్తిగత విభేదాలు లేవు అన్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత బీజేపీ తో విభేదించకుండా ఉండాల్సింది అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన బాబు, తన ఎంఎల్ఏ లను, తనను కాపాడుకోవడానికి బీజేపీతో దోస్తీ కోసం ఎంత వరకైనా వెళ్లొచ్చు. ఒకప్పుడు టీడీపీకి మిత్ర పక్షంగా ఉన్న జనసేన… బీజేపీ పార్టీతో చేతులు కలిపిన నేపథ్యంలో, టీడీపీ మళ్ళీ బీజేపీతో దోస్తీ కడుతుందన్న వాదన కొట్టిపారేయలేం. 2024 ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీచేసినా, ఒకే వేదికపై ఈ మూడు పార్టీలు కలిసి కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు .