Ayodhya Ram Mandir : అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతోంది. జనవరి 22న సోమవారం మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్ లగ్నంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది. జనవరి 18న రామ్ లల్లా విగ్రహాన్ని ఆలయంలోకి ప్రవేశపెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాముడి పట్టాభిషేకమంత గొప్పగా వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్త ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 22న రాష్ట్రంలో సెలవు ప్రకటించింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా సెలవు ప్రకటించాయి.
కేంద్రం కూడా..
తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా జనవరి 22న సెలవు ప్రకటించింది. రామ్‌లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం పూర్తయ్యే వరకు అంటే మధ్యాహ్నం 2:30 గంటల వరకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆఫీసులకు, కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని టీవీల్లో, ప్రత్యక్షంగా వీక్షించే వారికోసం ఆఫ్‌డే సెలవు ప్రకటించినట్లు కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది.
రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు..
ఇదిలా ఉండగా, రామాలయంలో ప్రతిష్టించే రామ్‌లల్లా విగ్రహాన్ని జనవరి 18న ఆలయ ప్రవేశం చేశారు. జనవరి 17న రామ్‌లల్లా విగ్రహం అయోధ్యకు చేరుకుంది. దీంతో రామ్‌లల్లా విగ్రహాన్ని అయోధ్యలో ఊరేగించారు. భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. పూజలు చేశారు. ఇక గురువారం రామ్‌లల్లా విగ్రహాన్ని నూతనంగా నిర్మించిర రామాలయంలోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పండితులు ఘనంగా పూజలు చేశారు.