Indian Currency Notes: భారతీయ కరెన్సీ నోట్లను మనం గమనిస్తే ప్రతీ నోటుపై గాంధీ ఫొటో కనిపిస్తుంది. ఇటీవల కొంతమంది అంబేద్కర్ ఫొటో ముద్రించాలని, రాముని ఫొటో ముద్రించాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే గాంధీ ఫొటో కరెన్సీ నోట్లపై ఎప్పటి నుంచి ముద్రిస్తున్నారు. గాంధీ కన్నా ముందు ఎవరి ఫొటో ఉండేది అనే వివరాలు తెలుసుకుందాం.
స్వాతంత్య్రానికి ముందు..
భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు బ్రిటిష్ పాలనలో ముద్రించిన కరెన్సీ నోట్లపై కింగ్ జార్జ్, క్వీన్ విక్టోరియా ఫొటోలు ఉండేవి. చాలా ఏళ్ళు ఇవి చెలామణిలో ఉన్నాయి. 1947, ఆగస్టు 15 అర్ధరాత్రి భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆ తర్వాత కరెన్సీ నోట్లను భారత ప్రభుత్వం ముద్రించింది. అయితే ఈ నోట్లపై చాలా ఏళ్లు ఎవరి ఫొటోలు ముద్రించలేదు.
1969 నుంచి గాంధీ ఫొటో..
మహాత్మాగాంధీ శత జయంతి సందర్భంగా 1969 నుంచి భారత కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటోతో రూ.100 ప్రత్యేక నోటును ముద్రించారు. ఇదే గాంధీజీ ఫొటో ముద్రించిన మొదటి నోటు. తర్వాత 1996 నుంచి అన్ని కరెన్సీ నోట్లపై గాంధీ ఫొటో ముద్రిస్తున్నారు. ఇప్పటికీ భారత ప్రభుత్వం గాంధీజీ ఫొటోతోనే నోట్లను ముద్రిస్తోంది.
ఇతర నేతల ఫొటోల కోసం…
ఇదిలా ఉండగా కరెన్సీ నోట్లపై గాంధీ ఒక్కరిదే కాకుండా స్వాతంత్య్ర సమరయోధులైన సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాలా లజపతిరాయ్, బాలగంగాధర్ తిలక్, రాజ్యాంగ నిర్మాత బీఆర్. అంబేద్కర్ ఫొటోలు ముద్రించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఇటీవల అయోధ్య రాముడి ఫొటోలు కూడా నోట్లు విడుదల చేయాలని డిమాండ్ పెరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా ఇతర నాయకుల ఫొటోలో కరెన్సీ విడుదల చేయలేదు.