https://oktelugu.com/

Btech Ravi Arrest: బీటెక్ రవి అరెస్ట్.. అర్ధరాత్రి హై డ్రామా

ఈనెల జనవరి 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కడపలోని దర్గాలో ముందుగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంలో కడప ఎయిర్పోర్ట్లో లోకేష్ కు బీటెక్ రవి తో పాటు టిడిపి శ్రేణులు స్వాగతం పలికాయి.

Written By:
  • Dharma
  • , Updated On : November 15, 2023 / 10:27 AM IST

    Btech Ravi Arrest

    Follow us on

    Btech Ravi Arrest: ఏపీ సీఎం జగన్ రాజకీయ ప్రత్యర్థి, పులివెందుల టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి అరెస్టు అయ్యారు.కొన్ని పాత కేసులను సాకుగా చూపి ఆయన అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.అయితే అర్ధరాత్రి సినీ ఫక్కిలో, కిడ్నాప్ తరహాలో అరెస్టు చేయడం విశేషం. రవితోపాటు గన్మెన్ ఫోన్లను తీసుకొని స్విచ్ ఆఫ్ చేశారు. పది నెలల కిందట కేసులను సాకుగా చూపి బీటెక్ రవిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి న్యాయాధికారి ముందు హాజరు పరచడంతో కేసు పూర్వాపరాలు బయటకు వచ్చాయి.

    ఈనెల జనవరి 27న లోకేష్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా కడపలోని దర్గాలో ముందుగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంలో కడప ఎయిర్పోర్ట్లో లోకేష్ కు బీటెక్ రవి తో పాటు టిడిపి శ్రేణులు స్వాగతం పలికాయి. అప్పట్లో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీటెక్ రవి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే అప్పటి కేసులో.. పోలీసులు బీటెక్ రవిని ఇప్పుడు అరెస్టు చేయడం విశేషం.మంగళవారం రాత్రి పులివెందుల నుంచి కడప వెళుతున్న బీటెక్ రవినివెంబడించి మరి పోలీసులు అరెస్టు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఆయనను అదుపులోకి తీసుకున్నది పోలీసులా? కాదా? అని తెలుసుకునేందుకు కుటుంబ సభ్యులకు గంటల వ్యవధి పట్టింది. కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్, డీఎస్పీ ఎండి షరీఫ్ లకు చాలాసార్లు ఫోన్ చేసినా వారు స్పందించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రాత్రి 11 గంటల సమయంలో కడప మ్యాజిస్ట్రేట్ ముందు బిటెక్ రవిని హాజరు పరిచారు. 10 నెలల కిందట నమోదైన కేసును.. ఇప్పుడు నాన్ బెయిలాబుల్ గా చూపారు.

    ప్రస్తుతం టిడిపిలో బీటెక్ రవి దూకుడుగా ఉన్నారు. తన రాజకీయ ప్రత్యర్థి సాక్షాత్ సీఎం జగన్ అయినా.. ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. 2016లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకంగా జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి పైనే గెలుపొందారు. అప్పటినుంచి బీటెక్ రవి పేరు మార్మోగుతోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ పై పోటీ చేసేందుకు బీటెక్ రవి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం కీలక పాత్ర పోషించారు. ఒకవేళ టిడిపి అధికారంలోకి వస్తే బీటెక్ రవి పాత్ర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కడప జిల్లాలో బీటెక్ రవి హవా పెరిగే పరిస్థితి ఉంటుంది. అందుకే ఆయనపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కొద్దిరోజులు కిందకే చెన్నై ఎయిర్పోర్ట్ లో బీటెక్ రవిని అరెస్టు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పటినుంచి మరింత దూకుడు కనబరుస్తున్న బీటెక్ రవి హవాను అడ్డుకునేందుకే ఈ అరెస్టు అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జగన్ కంట్లో నలుసుగా మారినందుకే ఈ అరెస్టు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతున్నారు. దీనిపై రాష్ట్రస్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నారు. బీటెక్ రవికి ఏం జరిగినా సీఎం జగన్ బాధ్యత అని నారా లోకేష్ హెచ్చరించారు.