Telugu News Channels: వ్యూసే న్యూస్ అయితే.. చానల్స్ పరిస్థితి ఇలానే ఉంటుంది

డిజిటల్ మీడియా ఉదృతంగా దూసుకురావడంతో దాని ప్రభావం ప్రధాన మీడియాపై పడింది. వార్తాపత్రికలు క్రమేపి మరుగున పడిపోతున్నాయి. కోవిడ్ వ్యాప్తి దానిపై మరింత ప్రభావం చూపింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 15, 2023 5:06 pm

Telugu News Channels

Follow us on

Telugu News Channels: ఒకప్పుడు ఏదైనా కొత్త న్యూస్ ఛానల్ వస్తోంది అంటే జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉండేది..ఫలానా రామోజీరావు ఈటీవీ న్యూస్ పెడుతున్నాడు, ఫలానా రవి ప్రకాష్ టీవీ9 ఛానల్ ఓపెన్ చేస్తున్నాడు అనే మౌత్ పబ్లిసిటీ అప్పట్లో బాగా జరిగేది. జనం కూడా ఆ చానల్స్ ను చూసేందుకు ఇష్టపడేవారు. అప్పటి జర్నలిస్టులలో పనిచేయాలని కసి ఉండేది కాబట్టి వార్తలను అద్భుతంగా ప్రజెంట్ చేసేవారు. ఈరోజు టీవీ9 ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం అప్పట్లో పని చేసిన జర్నలిస్టులే. మిగతా చానల్స్ కూడా కొద్దో గొప్పో ఆర్థికంగా అభివృద్ధి సాధించాయి అంటే దాని కారణం పాత్రికేయులే.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు.

పనితీరు మారిపోయింది

డిజిటల్ మీడియా ఉదృతంగా దూసుకురావడంతో దాని ప్రభావం ప్రధాన మీడియాపై పడింది. వార్తాపత్రికలు క్రమేపి మరుగున పడిపోతున్నాయి. కోవిడ్ వ్యాప్తి దానిపై మరింత ప్రభావం చూపింది. ఇక ఎలక్ట్రానిక్ మీడియా కూడా అనివార్యంగా డిజిటల్ మీడియాకు తలవంచాల్సిన పరిస్థితి నెలకొంది. స్మార్ట్ ఫోన్లు కూడా జనాలకు అత్యంత సులువుగా అందుబాటులోకి రావడంతో డిజిటల్ మీడియా అనేది మరింత చేరువైంది. ఇదే సమయంలో వార్త లక్షణం పూర్తిగా మారిపోయింది. వ్యూస్ న్యూస్ అయ్యే పరిస్థితి దాపురించింది. యాజమాన్యాలకు కూడా డబ్బులే ముఖ్యం కాబట్టి అనివార్యంగా అదే మార్గాన్ని అనుసరించడం మొదలుపెట్టాయి. ఇదే క్రమంలో జర్నలిస్టుల పనితీరు పూర్తిగా మారిపోయింది. విషయాడంబరం కంటే వాగాడంబరం ఎక్కువైపోయింది. దీంతో ఏది వైరల్ అయితే అదే వార్తగా చలామణి అవుతుంది.. ఈ దుస్థితికి మేనేజ్మెంట్లు ప్రధాన కారణం. మీడియా హౌస్ ను రన్ చేయడం అంటే సామాజిక బాధ్యత అని మర్చిపోయి కేవలం డబ్బు సంపాదనకు మాత్రమే అనే స్థాయికి తీసుకెళ్లాయి. ఫలితంగానే మీడియా హౌసులు అనేవి క్రమేపి దిగజారిపోతున్నాయి.

మౌత్ పబ్లిసిటీ ఏది

ముందుగానే మనం చెప్పుకున్నట్టు గతంలో ఏవైనా న్యూస్ చానల్స్ ప్రారంభమైతే జనాల్లో ఒక చర్చ జరిగేది. మౌత్ పబ్లిసిటీ ద్వారా వాటికి ఎక్కడా లేని క్రేజ్ వచ్చేది. నిన్నటికి నిన్న తెలుగు 360, బిగ్ టీవీ అనే రెండు శాటిలైట్ ఛానల్స్ ఓపెన్ అయ్యాయి. తనకి ఈ రెండు చానల్స్ మేనేజ్మెంట్ లు కూడా ఆర్థికంగా చాలా బలమైనవి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని యాజమాన్యాల కంటే నూరు పాళ్ళు నయం. కానీ జనాలకి న్యూస్ ఛానల్స్ చూసే ఓపిక తగ్గిపోవడంతో వీటిని పెద్దగా పట్టించుకోలేనట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ చానల్స్ ముందుగానే డిజిటల్ మీడియాలోకి ప్రవేశించాయి. అందులో కాస్త కూస్తో క్లిక్ అయిన తర్వాతే శాటిలైట్ ప్రసారాల్లోకి వెళ్లిపోయాయి. ఇవి మునుముందు ఎలా ఉంటాయనేది ఆ మేనేజ్మెంట్, అందులో పని చేస్తున్న పాత్రికేయుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కటి మాత్రం సుస్పష్టం మీడియాను ఒకప్పటిలాగా జనం నమ్మే పరిస్థితి లేదు. అరచేతిలో సోషల్ మీడియా ఉండడంతో వారు ప్రతి విషయాన్ని దాని ద్వారానే బేరీజు వేసుకుంటున్నారు.
Recommended Video: