PM Modi- YS Jagan: ఏపీలో విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ పక్షాలు విరుద్ధ ప్రయాణం చేస్తున్నాయి. ఎవరికి ఎవరు మిత్రులో.. ఎవరు శత్రువులో అర్థం కాని పరిస్థితి నెలకొంది. కానీ బీజేపీ తన మార్కు రాజకీయంతో మిగతా రాజకీయ పక్షాలకు గందరగోళంలో నెట్టేస్తోంది. ఏపీలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతుండడంతో ప్రధాని మోదీ, షా ద్వయం సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది.అటు అధికార పక్షం వైసీపీని చెరదీస్తుండగా.. మరోవైపు జనసేనతో కూడా స్నేహం కొనసాగిస్తోంది. కానీ ఎవరు ముఖ్యమన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ బద్ధ శత్రువుగా చూస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని సాగనంపాలని క్రుతనిశ్చయంతో ఉన్నారు. అటు బీజేపీ, ఇటు టీడీపీతో కూటమి ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కానీ ఆ రెండు పార్టీలు మాత్రం విరుద్ధంగా నడుస్తున్నాయి. తొలుత పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చిన చంద్రబాబు వ్యూహాత్మకంగా మౌనం పాటించగా.. బీజేపీ పవన్ కు దూరంగా జరుగుతోంది. తనకు కేంద్ర పెద్దలతో సత్సంబంధాలు ఉన్నాయని పవన్ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ వచ్చారు. కానీ పరిస్థితి చూస్తే మాత్రం డౌట్ గా కనిపిస్తోంది. గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఏపీలో పర్యటించిన పవన్ కలిసిన దాఖలాలు లేవు. తాజాగా ప్రధాని మోదీ పర్యటించినా పవన్ కు ప్రత్యేక ఆహ్వానమంటూ ఏదీ లేదు. దీంతో జనసేన, బీజేపీ మధ్య పొత్తు అసలు ఉంటుందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తనకు బద్ధ శత్రువు అయిన ఏపీ సీఎం జగన్ కు ఇస్తున్న ప్రాధాన్యత తనకు దక్కలేదన్న ఆవేదనలో పవన్ ఉన్నారు. బీజేపీ పెద్దల వైఖరిపై జనసేన శ్రేణులు కూడా ఆగ్రహంతో ఉన్నాయి. ఇన్నాళ్లూ తమతో స్నేహం చేస్తూ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ముఖం చాటేయ్యడంపై గుర్రుగా ఉన్నారు. అందుకే ఆ పార్టీతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. అవసరమైతే బీజేపీతో కటీఫ్ చెప్పి టీడీపీతో సంధి కుదుర్చుకోవాలని భావిస్తున్నారు.
Also Read: Bandi Sanjay: విజయ్ సంకల్ప పరీక్షలో బండి సంజయ్ కి డిస్టింక్షన్
టీడీపీని లెక్కచేయని వైనం..
మరోవైపు టీడీపీ కూడా బీజేపీ అగ్ర నాయకత్వంపై ఆగ్రహంగా ఉంది. ప్రస్తుతానికి తమ పరిస్థితి బాగాలేనందునే బీజేపీ పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. బీజేపీతో టీడీపీ లాభపడిందని కేంద్ర పెద్దలు భావిస్తున్నట్టుందని.. వాస్తవానికి టీడీపీతోనే బీజేపీ గతంలో లాభపడిందని ఉదహరిస్తున్నారు. అన్ని పార్టీల నాయకులను పిలిచి చంద్రబాబును పిలవకపోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీ తరుపున ప్రతినిధిని పంపాలని మాత్రమే కోరడం ఎంతవరకు సమంజసమంటున్నారు. పోనీ కార్యక్రమానికి హాజరైన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును దారుణంగా అవమానించారని.. ప్రధాన మంత్రి కార్యాలయ జాబితాలో అచ్చెన్నాయుడు పేరు ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని పేరు తొలగించిందని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, జనసేనతో కలిసి నడిచేందుకు టీడీపీ నాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ మారిన పరిస్థితుల నేపథ్యంలో అవసరమైతే జనసేన, లేకుంటే ఒంటరి పోరాటానికి సిద్ధం కావాలని భావిస్తోంది. మరోవైపు పవన్ ను పిలవకుండా ఆయన సోదరుడు చిరంజీవికి అగ్రతాంబూలం వేస్తూ అటు కేంద్ర పెద్దలు, ఇటు ఏపీ సీఎం జగన్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రోటోకాల్ ప్రకారం లోకల్ ఎంపీ రాఘురామరాజును సైతం పక్కన పెట్టేసిన కేంద్ర పెద్దలు ఎటువంటి సంకేతాలు పంపుతున్నారో అర్థం కావడం లేదని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ అవసరాల కోసం..
ప్రస్తుతానికి వైసీపీ అవసరం కేంద్ర పెద్దలకు ఉంది. రాష్ట్ర పతి ఎన్నికల్లో వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీల ఓట్ల అవసరం ఉంది. అదే సమయంలో వైసీపీ కూడా భేషరతుగా ఎన్డీఏ బలపరచిన అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారు. ఏకంగా నామినేషన్ ప్రక్రియకు కూడా ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి హాజరయ్యారు. బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నుంచే ఎన్డీఏకు పూర్తిస్థాయి మద్దతు లభిస్తోంది. అందుకే మోదీ, షా ద్వయంలకు జగన్ అంటే ఒకరకమైన అభిమానం, సదాభిప్రాయం నెలకొంది. అందుకే ఈ సమయంలో వారు జనసేన, టీడీపీల గురించి అసలు పట్టించుకోవడం లేదు. ఏపీలో ఉన్నది వైసీపీ ప్రభుత్వమే అయినా.. అది కూడా తమదేనన్న రేంజ్ లో వారి నమ్మకం కుదిరింది. అందుకే మిగతా రాజకీయాలన్నీ పక్కనపడేసి వైసీపీ ప్రభుత్వానికి ఇతోధికంగా సాయం చేస్తూ వస్తున్నారు. అనుకూలంగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో ఒకలా… వ్యతిరేకంగా ఉండే వారిలో మరోలా వ్యవహరించే బీజేపీ పెద్దలు ఏపీ విషయంలో మాత్రం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్న పాలనా లోపాలు, వ్యవస్థల నిర్వీర్యం, ఆర్థిక దివాళాకోరుతనం గురించి ఫిర్యాదులు వెల్లువెత్తినా పట్టించుకోవడం లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాత్రమే ముందడుగు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అసలు బీజేపీ వైపు చూడడం కంటే టీడీపీ, జనసేనలు ప్రజల్లోకి వెళ్లి వారి అభిమానం చూరగొనడమే మేలని సూచిస్తున్నారు.
Also Read:Janasena Jana Vani Program : పవన్ కళ్యాణ్ పై చిగురిస్తున్న ఆశలు