BJP
BJP: వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం పార్టీ ప్రక్షాళన మొదలు పెట్టింది. కీలక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా పార్టీ జాతీయ కార్యవర్గంలో భారీ ప్రక్షాళన చేశారు. ఇద్దరు ప్రధాన కార్యదర్శుల తొలగింపుతోపాటు వెనుకబడిన తరగతిగా ఉన్న పాస్మాండ ముస్లిం వర్గానికి చెందిన అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వీసీ తారిఖ్ మన్సూర్‌ను పార్టీ ఉపాధ్యక్ష పదవిలోకి తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణకు చెందిన ఎంపీ బండి సంజయ్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజన నాయకురాలు లతా ఉసేండికి ఉపాధ్యక్ష పదవి ఇచ్చా రు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడం, త్వరలోనే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో లత నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ రాధా మోహన్‌సింగ్‌ను పార్టీ ఉపాధ్యక్ష స్థానం నుంచి తొలగించారు.
ఇద్దరు ప్రధాన కార్యదర్శుల తొలగింపు..
పార్టీలోని మొత్తం 9 మంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. ప్రక్షాళనలో భాగంగా కర్ణాటకకు చెందిన సీటీ రవి, అసోంకు చెందిన ఎంపీ దిలీప్ సైకియాలను తొలగించారు. కార్యదర్శులుగా ఉన్న ఎంపీలు వినోద్‌సొంకర్, హరీశ్ ద్వివేదీలతోపాటు ఏపీ వ్యవహారాలు చూసే సునీల్ దేవధర్‌ను పక్కన పెట్టారు. యూపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు రాధామోహన్ అగర్వాల్‌ను జాతీ య ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
కొత్తగా పలువురికి చాన్స్..
నూతన జాతీయ కార్యదర్శులుగా పలువురికి అవకాశమిచ్చారు. వీరిలో కేరళకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేత ఏకే.ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ, యూపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సురేంద్రసింగ్ నాగర్, అసోంకు చెందిన రాజ్యసభ సభ్యుడు కామాఖ్య ప్రసాద్ టాసా ఉన్నారు. వీరిలో సురేంద్రసింగ్ పశ్చిమ యూపీలో బలమైన సామాజిక వర్గం గుర్జర్‌కు చెందిన నాయకుడు. కేరళ ఎన్నికల నేపథ్యంలో అనిల్ ఆంటోనీ నియామకానికి ప్రాధాన్యం ఏర్పడింది.
అయితే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలి బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఆమె స్థానంలోకి మరో మహిళానేతకు అవకాశం కల్పించలేదు. మొత్తం 13మంది ఉపాధ్యక్షులు, బీఎల్.సంతోష్ సహా 9 మంది ప్రధాన కార్యదర్శులు, 13 మంది కార్యదర్శులు బీజేపీలో ఉన్నారు. వీరిలో ఐదుగురు మహిళా ఉపాధ్యక్షులు, నలుగురు మహిళా కార్యదర్శులున్నారు.
ముస్లింలకు గాలం..
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ వీసీ, యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్సీ తారిఖ్ మన్సూర్‌ను బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించడం వెనుక వెనుకబడిన తరగతిగా ఉన్న పాస్మాండ ముస్లిం వర్గాన్ని తమవైపు ఆకర్షించే వ్యూహం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. గతంలో సీఏఏ, ఎన్‌ఆర్సీలకు వ్యతిరేకంగా అలీగఢ్ వర్సిటీలో భారీ ఎత్తున ఉద్యమాలు సాగినప్పుడు మన్సూరే వీసీగా ఉన్నారు. ఆ ఉద్యమాల సెగ తగలకుండా వర్సిటీని మధ్యేమార్గంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే, శాంతియుత హిందు–ముస్లిం సహకారంపై మొఘల్ యువరాజు దారా షిఖో చేసిన బోధనలను ప్రచారం చేసే ప్రాజెక్టుకు సంబంధించి ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి మన్సూర్ పనిచేశారు. యూపీలో దళిత, వెనుకబడిన తరగతులకు చెందిన వారు పాస్మాండ ముస్లింలుగా ఉన్నారు. వీరిని తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ కొన్నాళ్లుగా మైనారిటీ మోర్చా పేరుతో సమావేశాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో ముస్లింల ఓటర్లు 15–20 లోక్‌సభ స్థానాల్లో ప్రభావితం చేసే స్థాయిలో ఉండడంతో వారిని ఆకర్షించేందుకు బీజేపీ మన్సూర్‌ను ఉపాధ్యక్ష స్థానంలోకి తీసుకుందనే వాదన వినిపిస్తోంది.