America: మనల్ని ఇష్టపడేవాళ్లు విడిచి వెళ్లినా కూడా వారి జ్ఞాపకాలు మనలను తరచుగా పలకరిస్తూ ఉంటాయి. వారు మన మధ్య ఉంటే బాగుండన్న భావన నిత్యం కలుగుతూ ఉంటుంది. కానీ అవయవదానం చేసిన సందర్భాల్లో వ్యక్తులు మరణించినా వారి అవయవాలు వేరే వాళ్లకి అమరిస్తే అవి సజీవంగానే ఉంటాయి.
నాలుగేళ్ల క్రితం మరణం..
అమెరికాలోని కనెక్టికట్ ప్రాంతానికి చెందిన ఎస్టబెన్ శాంటియాగో(39) నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. అతనికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ సభ్యుల అంగీకారంలో ఎస్టబెన్ శాంటియాగో అవయవాలు దానం చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత తన తండ్రి గుండె ఎవరికి అమర్చారో తెలుసుకునే ప్రయత్నం చేశారు కూతుళ్లు.. చివరకు గుండె స్వీకరించిన వ్యక్తి ఆచూకీ కనిపెట్టారు. వెంటనే ఆ గుండె మీద చెవులను ఆనించి తండ్రి గుండె చప్పుడు విన్నారు.
నాలుగేళ్లుగా వెతుకులాట..
ఎస్టబెన్ శాంటియాగో కూతురు కిసండ్ర శాంటియాగో(22) తండ్రి గుండె అమర్చిన వ్యక్తి కోసం ఈ వెతుకులాటకు శ్రీకారం చుట్టింది. అలా మొదలైన ఆమె ప్రయత్నం నాలుగేళ్లపాటు సాగింది. చివరికి తన తండ్రి హృదయాన్ని ఎవరికి అమర్చారో కనిపెట్టింది. వెంటనే తన చెల్లెళ్లను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లి వారు ఆయన గుండెల మీద తల ఆనించి గుండె చప్పుడును విని ఉద్వేగానికి లోనయ్యారు.
నా గుండె తేలికైంది..
ఈ సందర్భంగా కిసండ్ర శాంటియాగో మాట్లాడుతూ.. ‘మా నాన్న నిజంగా సంతోషించేవారు. మా నాన్న కోమాలోకి వెళ్లి చనిపోయాక ఆయన అవయవాలను దానం చేయాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా కష్టమనిపించింది. చివరకు ఎలాగో అంగీకరించాను. ఆ రోజు నుంచి నా గుండె భారంగానే ఉంది. ఈరోజు ఆయన గుండె చప్పుడు విన్నాక అది తేలికైందని చెప్పి కన్నీటి పర్యంతమైంది’ అని తెలిపింది. ఈ దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విశేషమైన స్పందన వస్తోంది.
కొడుకు అవయవాలు దానం చేసి..
ఇటీవల ఓ వైద్యురాలి కొడుకు చేతికి వచ్చాక అర్ధంతరంగా చనిపోయాడు. స్వయంగా వైద్య వృత్తిలో ఉన్న ఆమె కొడుకు పోయిన దుఃఖాన్ని దిగమింగుకుని.. తనయుడి అవయవాలతో మరో నలుగురికి జీవం పోసింది. చనిపోయిన గంట వ్యవధిలోనే తనయుడి గుండెను మరో వ్యక్తికి అమర్చారు. గుండెను స్వీకరించిన వ్యక్తి కృతజ్ఞత చెప్పడానికి తనదగ్గరకు రావడంతో స్టెతస్కోప్‌తో తన కొడుకు గుండెచప్పుడు విని మురిసిపోయింది. ఈ ఘటన ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దానంతో అవయవాలు పదిలం..
అవయవదానం చేయడం ద్వారా ఇష్టమైన వారి అవయవాలు ఇతరుల దేహాల్లో పదిలంగా ఉంటున్నాయి. దాతల సహకారంతో ఎంతోమందికి పునర్జన్మ లభిస్తోంది. అయితే గతంలో స్వీకర్తల వివరాలు చెప్పడానికి వైద్యులు అంగీకరించేవారు కాదు. కానీ ప్రియమైన వారి అవయవాలను చూసుకుని జ్ఞాపకాలు తలుచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతుండడంతో అవయవాలు అమర్చివారి వివరాలు వెల్లడిస్తున్నారు.