
ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయని సామెత. ఎన్నికలకు ముందు తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది బీజేపీలోకి వలస పోయారు. పరిస్థితి మారిపోవడంతో మళ్లీ తిరిగి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీన్ రివర్స్ అయింది. అటు వెళ్లిన వారందరు ఇటు తిరిగి వస్తున్నారు. అధికారంలోకి రాగానే అందరికి నమ్మకం కలుగుతోంది.
తృణమూల్ కాంగ్రెస్ 292 అసెంబ్లీ స్థానాల్లో 213 గెలవగా బీజేపీ 77 స్థానాలకు పరిమితం అయింది. దీంతో పార్టీ వీడి వెళ్లిన నేతలు తిరిగి తృణమూల్ కాంగ్రెస్ లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహా, మార్చిలో తృణమూల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిపోయారు.అయితే అక్కడ ఇమడలేక పోతున్నామని తిరిగి సొంత గూటికి రావాలనిపిస్తోందని వ్యాఖ్యలు చేస్తున్నారు.
బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ లోకి జంపు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు చెబుతున్నారు. వీరిని తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు మమతాబెనర్జీ జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఎవరెవరిని పార్టీలోకి తిరిగి తీసుకోవాలనే దానిపై నిర్ణయం తీసుకుంటున్నట్లు భావిస్తున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించడంతో అందరి దృష్టి పార్టీపై పడింది. మమతా బెనర్జీ ఒంటరిగా బీజేపీని ఎదుర్కొని విజయం సాధించడంపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. దీదీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. పార్టీలోకి రావడానికి నిరంతరం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తమ విధేయులను బుజ్జగించే పనిలో పడ్డారు.