Bandi Sanjay: ‘తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం లోక్‌సభ ఎన్నికల తర్వాత కూలిపోతుంది. బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు స్కెచ్ వేస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఆర్థికసాయం చేసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉన్నారు. వారంతా కేసీఆర్‌తో టచ్‌లోకి వెళ్లారు’ తెలంగాణ రాజకీయాలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఇవీ. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కించాయి. ఇటు అధికార కాంగ్రెస్‌తోపాటు, అటు ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ను ఉలిక్కిపడేలా చేశాయి. అయితే ఈ వ్యాఖ్యల్లో ఎంత నిజముంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందు చేస్తున్న ప్రయత్నాలు బండి సంజయ్‌కు ఎలా తెలిశాయి. అన్న చర్చ జరుగుతోంది. మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక భారీ వ్యూహం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
స్వ ప్రయోజనాల కోసమే…
బండి సంజయ్ వ్యాఖ్యల వెనుక, బీజేపీ ప్రయోజనాలు దాగి ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రచారం చేసింది. ఆ ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు చాలా వరకు నమ్మారు. దీంతో ఇటు బీఆర్‌ఎస్, అటు బీజేపీ గెలుస్తామనుకున్న స్థానాల్లో ఓడిపోయాయి. ఈ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పడకుండా ఉండేందుకు బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటి కాదన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచన ఉన్నట్లు పేర్కొంటున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ – బీఆర్‌ఎస్ ఒక్కటే అన్న భావన ఉంటే కాంగ్రెస్ లబ్ధి పొందుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఓట్లకు గండి కొట్టాలన్న ఉద్దేశంతోనే బండి సంజయ్ ఈ వ్యాఖ్యలు చేశారని అంచనా వేస్తున్నారు.
= కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండూ వ్యతిరేకమే అని చూపించాలనే ప్రయత్నంలో భాగంగా కూడా ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. తమకు కాంగ్రెస్ ఎంతో, బీఆర్‌ఎస్ అంతే అన్న భావన ప్రజల్లో కల్పించేందుకు బండి సంజయ్ బీఆర్‌ఎస్ టార్గెట్‌గా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
= కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దోస్తీ ఉన్నట్లు కూడా ప్రొజెక్టు చేయడానికి బండి సంజయ్ వ్యాఖ్యలు చేసి ఉంటారని తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని చెప్పడం ద్వారా రెండు పార్టీలు ఒక్కటే అని చెప్పడమే కాకుండా, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్లే అన్ని మొదటి నుంచి చేస్తున్న ప్రచారాన్ని బలపర్చే ఉద్దేశం ఉంది.
= ఇక మరో ఆలోచన ఏంటంటే.. ప్రభుత్వాలను బీజేపీ కూలుస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను తోసి పుచ్చి.. మచ్చను తొలగించుకునే ప్రయత్నంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూల్చమని, బీఆర్‌ఎస్ కూలుస్తుందని వెల్లడించినట్లు తెలుస్తోంది.
మొత్తంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు ఆశామాషీగా చేసినవి కావని, వాటి వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఏ పార్టీ కూల్చినా అది తప్పే అవుతుందని పేర్కొంటున్నారు.