Homeఅంతర్జాతీయంబైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం స్పీచ్‌ డ్రాఫ్ట్‌ చేసింది తెలంగాణ కుర్రాడే..

బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం స్పీచ్‌ డ్రాఫ్ట్‌ చేసింది తెలంగాణ కుర్రాడే..

Joe Bidenమరికొద్ది గంటల్లో అగ్రరాజ్యం అమెరికాలో నవశకం ప్రారంభం కాబోతోంది. ట్రంప్‌ పాలన ముగియగా.. జో బైడెన్‌ నేడు అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవం కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బైడెన్ టీమ్‌లో 20 మంది భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులకు చోటు దక్కడంతో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వంపై భారతీయుల్లో రెట్టింపు ఆసక్తి నెలకొంది. బుధవారం బైడెన్ ప్రమాణ స్వీకారోత్సవంలోనూ భారత సంతతి వ్యక్తే పరోక్షంగా కీలక పాత్ర పోషించనున్నారు. ఆయనే వినయ్ రెడ్డి. తెలంగాణ మూలాలు ఉన్న చొల్లేటి వినయ్ రెడ్డి బైడెన్‌కు స్పీచ్ రైటింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Also Read: బీచ్‌ రోడ్డు బిల్డింగుల పని బిగ్‌ డే..: ఇక జో బైడెన్‌ శకం

జాతిని ఉద్దేశించి బైడెన్‌ ఏం ప్రసంగించనున్నారు.. ప్రపంచానికి ఏం సందేశం ఇవ్వబోతున్నారు..? ప్రస్తుతం అంతటా ఇదే ఆసక్తి నెలకొంది. ట్రంప్ హయాంలో అమెరికా సమాజం వర్గాలుగా విడిపోయిన నేపథ్యంలో ఐక్యతా సూత్రమే ప్రధాన ఉద్దేశంగా బైడెన్ స్పీచ్ ఉండనున్నట్లు స్థానిక మీడియా చెబుతోంది. 20 నుంచి 30 నిమిషాల పాటు సాగే ఈ ప్రసంగంలో అమెరికా సమాజాన్ని తిరిగి ఏకతాటి పైకి తీసుకురావడమే లక్ష్యంగా బైడెన్ ప్రసంగించే అవకాశం ఉంది. అమెరికా సమాజాన్ని ప్రభావితం చేసే… ఆ దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ఈ స్పీచ్‌‌ను భారత సంతతి వ్యక్తి వినయ్ రెడ్డి డ్రాఫ్ట్ చేయడంపై భారతీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

చొల్లేటి వినయ్ రెడ్డి మూలాలు తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామంలో ఉన్నాయి. ఈ గ్రామానికి చెందిన నారాయణరెడ్డి–-విజయారెడ్డి దంపతుల కుమారుడు వినయ్ రెడ్డి. వృత్తి రీత్యా వైద్యుడైన నారాయణరెడ్డి 1970లో కుటుంబంతో సహా అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయన ముగ్గురు కుమారుల్లో వినయ్ రెడ్డి ఒకరు. అమెరికాలోని ఒహియా రాష్ట్రంలో ఉన్న డేటన్‌లో పుట్టి పెరిగిన వినయ్ రెడ్డి స్కూలింగ్, గ్రాడ్యుయేషన్ అక్కడే పూర్తి చేశారు. మియామీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్-–హ్యారిస్ ఎలక్షన్ క్యాంపెయిన్‌లో సీనియర్ అడ్వైజర్‌గా, స్పీచ్ రైటర్‌గా పనిచేశారు.

వినయ్ రెడ్డి కుటుంబానికి పోతిరెడ్డిపేటలో ఇప్పటికీ మూడెకరాల వ్యవసాయ భూమితోపాటు సొంతిల్లు ఉంది. ఇప్పటికీ ప్రతీ ఆర్నెళ్లకు ఒకసారి వినయ్ రెడ్డి తల్లిదండ్రులు పోతిరెడ్డిపేటకు వచ్చి వెళ్తుంటారు. వినయ్ రెడ్డి తాత తిరుపతి రెడ్డి గతంలో పోతిరెడ్డిపేటకు 30 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. ప్రస్తుతం వినయ్ రెడ్డికి బైడెన్ టీమ్‌లో కీలక బాధ్యతలు దక్కడంతో తెలంగాణలోని వారి బంధువులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
.
Also Read: బిగ్‌ డే..: ఇక జో బైడెన్‌ శకం

అమెరికాలో ‘ఇనాగురల్ అడ్రెస్’ (ప్రమాణస్వీకారం సందర్భంగా ఇచ్చే స్పీచ్) ట్రెండ్ ఏప్రిల్ 30,1789లో మొదలైంది. ఆనాటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టేవారు జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఆనవాయితీగా మారింది. 1793లో కేవలం 135 పదాలతో జార్జ్ వాషింగ్టన్ చేసిన ప్రసంగం అమెరికా అధ్యక్ష చరిత్రలోనే అతి స్వల్ప ప్రసంగం. 1841లో 8,455 పదాలతో విలియమ్ హెన్రీ హారిసన్ చేసిన ప్రసంగం అమెరికా అధ్యక్ష చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ప్రసంగం. ఆ ప్రసంగం దాదాపు 2 గంటల పాటు సాగింది.

ఆఫీస్ ఆఫ్ స్పీచ్ రైటింగ్ అనేది వైట్ హౌస్ లోని ఒక అధ్యక్ష విభాగం. అధ్యక్షుడి ప్రసంగాలకు సంబంధించిన పరిశోధన, రైటింగ్ బాధ్యతలను ఇది నిర్వర్తిస్తుంది. గతంలో ఒబామా స్పీచ్ రైటర్‌గా పనిచేసిన సరద పెరీ 2019లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ఏ స్పీచ్‌కి అయినా ప్రేక్షకులే ప్రపంచం..’ అని పేర్కొన్నారు. మరో మాజీ స్పీచ్ రైటర్ కైల్ ఓ కోనర్ మాట్లాడుతూ.. అధ్యక్షుడి శైలిని అతని ఆలోచనలను చిత్రిక పట్టడం స్పీచ్ రైటింగ్‌లో కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుతం బైడెన్ ఇనాగురల్ స్పీచ్‌ను మైక్ డోనిలొన్ పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం అంతర్జాతీయ వార్తలు

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version