తల్లి తండ్రుల మరణాంతరం నంద్యాల, ఆళ్లగడ్డలలో టిడిపిలో తిరుగులేని నాయకురాలిగా ఉంటూ, చిన్న వయస్సులోనే మంత్రి పదవి కూడా సంపాదించి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దృష్టిలో మంచి పేరున్న భూమా అఖిలప్రియ రెండు నెలలుగా టిడిపిలో క్రియాశీలకంగా కనిపించక పోవడం ఆ పార్టీ వర్గాలలో విస్మయం కలిగిస్తున్నది.
సొంత తమ్ముడి రాజకీయ భవిష్యత్ కోసం ఆమె చేస్తున్న ప్రయత్నాలకు పార్టీ అధిష్టానం నుండి సుముఖత వ్యక్తం కాకపోతూ ఉండడంతో అలిగి ఉన్నట్లు తెలుస్తున్నది.
తల్లి ఆకస్మిక మరణంతో ఆమె స్థానంలో ఆళ్లగడ్డ నుండి శాసన సభకు ఎన్నిక కావడం ద్వారా రాజకీయ ప్రవేశం చేసిన ఆమె తండ్రి ఆకస్మిక మరణంతో నంద్యాలలో ఏర్పడిన రాజకీయ లోటును శిల్ప సోదరులు భర్తీ చేసే అవకాశం ఇవ్వకుండా తన బాబాయి కుమారుడు బ్రహ్మానందరెడ్డిని తీసుకు వచ్చి అక్కడి నుండి ఎమ్యెల్యేగా చేశారు. దానితో శిల్పా సోదరులు వైసీపీకి వెళ్లడం తెలిసిందే.
గతం ఎన్నికలలో ఓటమి చెందిన బ్రహ్మానందరెడ్డి ఇప్పుడు నంద్యాల నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ గా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికలలో ఇక్కడి నుండి సొంత తమ్ముడు దిగద్విఖ్యాత్ రెడ్డికి నిలబెట్టించడం కోసం ఇప్పుడే తగు భూమిక ఏర్పాటు చేస్తున్నారు. అందుకోసం అతనిని నియోజకవర్గం ఇంచార్జ్ గా చేయమని పార్టీ అధిష్టానంపై వత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు నుండి తగు స్పందన లేకపోవడంతో ఆమె ఒకింతగా అసహనంతో ఉన్నట్లు చెబుతున్నారు.
కొంతకాలంగా నంద్యాలలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలలో బ్రహ్మానందరెడ్డిని పక్కన పెట్టి జగద్విఖ్యాత్ రెడ్డితోనే చేయిస్తున్నారు. ఇటీవల చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి కూడా తన తమ్ముడినే పంపాలని ఆమె భావించినా, తనకే పిలుపు రాకపోవడంతో మౌనంగా ఉండవలసి వచ్చింది.
మరోవంక టిడిపి కొనసాగే విషయంలో కూడా బ్రహ్మానందరెడ్డి అన్యమనస్కంగా ఉన్నట్లు తెలుస్తున్నది. పక్కనే ఉన్న బనగానపల్లె వైసిపి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి బ్రహ్మానంద రెడ్డి స్వయానా అల్లుడు. , సీనియర్ నాయకులందరూ పార్టీని వీడటం, ఇక రాష్ట్రంలో వైసిపి ఎదురులేని పార్టీగా నిలబడటం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో అయినా టిడిపి గెలుస్తుందో లేదో అనే అనుమానాలూ లేకపోలేదు.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టిడిపిలో కొనసాగాలా? లేక వైసిపిలోకి వెళ్లాలా? అనే ఊగిసలాట ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వైసిపిలోకి వెళ్లిపోతే నంద్యాలలో తన తమ్ముడిని నిలబెట్టుకోవాలన్న అఖిల ప్రయత్నం సుగమం అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా తమ్ముడి రాజకీయ భవిష్యత్ కోసం కోరి తెచ్చుకున్న బాబాయి కుమారుడికి ఆమె మొండిచెయ్యి చూపించడం జరుగుతున్నది.