ప్రముఖ హీరో-జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి తరుఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు సోము వీరరాజు చేసిన ప్రకటన మీడియా.. రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. ప్రముఖ చానెల్స్ అన్నీ కూడా సోము వీరరాజు వ్యాఖ్యలపై పెద్ద చర్చలు జరిపాయి. వివిధ రాజకీయ విశ్లేషకుల నుండి ఆసక్తికరమైన పరిశీలనలు వెల్లువెత్తాయి.
పవన్ ను సీఎంగా చేసిన ప్రకటన వైసీపీ, టీడీపీలను షేక్ చేసింది. భయపడ్డ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మేరకు ట్వీట్ చేసి తన ఆందోళనను పరోక్షంగా బయటపెట్టేశారు. సోము వీర్రాజు వ్యాఖ్యలకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. తెలుగు దేశం పార్టీ నుండి తీవ్రమైన స్పందనలు వచ్చాయి.
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏపీలో సిఎం అభ్యర్థిగా తెరపైకి తేవడం గొప్ప ఎత్తుగడ అని.. దీనివల్ల పవన్ ఫ్యాన్స్, జనసైనికులు బాగా పనిచేసి కూటమి విజయానికి పాటుపడుతారని బీజేపీ భావిస్తోంది. తిరుపతిలోనూ ఈ ప్రకటన బీజేపీకి సానుకూల ఫలితాన్ని ఇస్తుందని అంటున్నారు.
సోము వీర్రాజు మాట్లాడుతూ “ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలోని బిజెపి నాయకత్వానికి స్పష్టమైన సందేశం పంపారు. పవన్ కళ్యాణ్ తనకు ఇష్టమని, ఆయనకు బిజెపి నాయకులందరూ గౌరవం, ఆప్యాయత పంచాలని… వచ్చే ఎన్నికల్లో ఆయన మన సీఎం అభ్యర్థి కానున్నారని.. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి ”అని మోడీ చెప్పినట్లు తెలిపారు. కూటమి భాగస్వామిని సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నందుకు బిజెపిపై ఇంతవరకు కోపంగా ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు కూల్ అయ్యారు. ఏకంగా సీఎం పవన్ అని సోము వీర్రాజు చేసిన ప్రకటనతో జనసైనికుల్లో హుషారు ఉరకలెత్తుతోంది. కూటమి విజయావకాశాలను ఇది ప్రభావితం చేస్తుందని.. బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.
“అవును, వీరరాజు చెప్పినది 100 శాతం సరైనది. పవన్‌కు రాష్ట్ర సీఎం కావడానికి అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. జనసేన, బిజెపి నాయకులందరూ కష్టపడి పనిచేస్తే, రాబోయే రోజుల్లో ఇది రియాలిటీ అవుతుంది ”అని జనసేన నాయకుడు నాదేండ్ల మనోహర్ సైతం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తిరుపతి ఎన్నికల్లో పవన్ ప్రచారం చేస్తాడని.. తిరుపతిలో బీజేపీ గెలుపునకు దోహద పడుతారని తెలుస్తోంది.
మొత్తంగా ‘పవన్ యే సీఎం’ అని సోము వీర్రాజు చేసిన ప్రకటనతో జనసేన నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం వస్తోంది. బీజేపీ కూటమికి ఇది మరింత బూస్ట్ ను ఇచ్చినట్టు అయ్యింది. పవన్ నాయకత్వంలో సోము వీర్రాజు సహా అందరు బీజేపీ నేతలు కలిసికట్టుగా ముందుకెళితే 2024లో ఆ పార్టీకి ఖచ్చితంగా విజయావకాశాలు పెరుగుతాయి. తిరుపతి ఎన్నికల్లోనూ లాభం జరుగుతుంది. పవన్ క్రేజ్ ను వాడుకుంటే బీజేపీకి కేంద్రంలో లాభం జరుగుతుంది.