Amaravati Cricket Stadium: ఏపీలో క్రికెట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సర్వశక్తులు వండుతోంది. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారు. క్రికెట్ క్రీడను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో అంతర్జాతీయ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో సాన్నిహిత్యం పెంచుకుంటున్నారు. ఆపై ప్రపంచ స్థాయి క్రికెట్ మ్యాచ్లు జరిగిన చోట వాలిపోతున్నారు. మరోవైపు ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి ఏ అవకాశాన్ని జారవిడుచుకోవడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా క్రికెట్ విషయంలో మరో అప్డేట్ వచ్చింది. అమరావతిలోని ఏసీ ఏ క్రికెట్ స్టేడియానికి మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లకు ప్రధాన కేంద్రంగా మార్చాలని నిర్ణయించడం విశేషం. ఈ విషయాన్ని ధ్రువీకరించారు ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేసినేని శివనాథ్. ఏసీ ఏ కార్యదర్శిగా ఉన్న సాన సతీష్ తో కలిసి మంగళగిరి స్టేడియాన్ని పరిశీలించారు. ఈ ఏడాది జరిగే ఏపీఎల్ సీజన్ 5 మొదటి మ్యాచ్ మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
* అంతర్జాతీయ స్పోర్ట్స్ క్లబ్..
అమరావతిలో( Amaravathi ) అంతర్జాతీయ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు భారీగా భూమిని కూడా కేటాయించింది. మరోవైపు ఏపీ క్రికెట్ అసోసియేషన్ మొత్తం ఇప్పుడు కూటమి ఆధీనంలోకి వచ్చింది. విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని చిన్ని పూర్తి అసోసియేషన్ బాధ్యతలు తీసుకున్నారు.. మరో ఎంపీ సానా సతీష్ సైతం కీలకంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జై షా తో మంత్రి నారా లోకేష్ మంచి అనుబంధం పెంచుకున్నారు. ఈయన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు. తరచూ లోకేష్ ఆయనను కలుస్తున్నారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధికి సంబంధించి అన్ని అంశాలను ఆయనతో చర్చిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ క్రీడాకారులతో నిత్యం మమేకమై పనిచేస్తున్నారు. మొన్ననే ఢిల్లీ ఎయిర్పోర్టులో సచిన్ టెండూల్కర్ తో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే ఈ పరిణామాలన్నీ ఏపీలో క్రికెట్ అభివృద్ధి కోసమే.
* స్టేడియం అభివృద్ధి పనులు..
తాజాగా మంగళగిరి( Mangalagiri) స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో లీగ్ మ్యాచ్లు నిర్వహించాలని నిర్ణయించడం మాత్రం శుభపరిణామమే. ప్రస్తుతం ఈ స్టేడియంలో అభివృద్ధి పనులు పూర్తిచేసి.. రాబోయే రోజుల్లో దేశ వాలి సహా ఇతర మ్యాచ్ లు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఎంపీ కేసినేని చిన్ని తెలిపారు ప్రస్తుతం ఈ స్టేడియంలో క్రీడాకారుల కోసం అవసరమైన గదులు నిర్మిస్తున్నారు. ఇంకా కొన్ని రకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాదాపు 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు అంతర్జాతీయ స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటుకు సంబంధించి.. అంతర్జాతీయ క్రీడా సంస్థల సహకారం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అవన్నీ ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నాయి.