Nandyala Politics: భూమా కుటుంబానికి భ్రమలు వీడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తమను పక్కన పెడుతోంది అన్న ఆందోళన ఆ కుటుంబంలో వ్యక్తమవుతోంది. కుటుంబంలో జరుగుతున్న ఆధిపత్య పోరుతో పార్టీకి నష్టం జరుగుతుందని హై కమాండ్ భావిస్తోంది. అందుకే అక్కడ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే మేలని ఒక నిర్ణయానికి వస్తోంది. ముఖ్యంగా నంద్యాల తో పాటు ఆళ్లగడ్డలో కొత్త నాయకత్వాలను టిడిపి తెరపైకి తేవడం విశేషం. ఆ రెండు చోట్ల భూమా కుటుంబాన్ని విడిచిపెట్టడమే మేలని చంద్రబాబు ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
భూమా నాగిరెడ్డి అకాల మరణంతో వారసురాలిగా భూమా అఖిలప్రియ తెరపైకి వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. 2019లో ఓడిపోయాక అటు ఆళ్లగడ్డ తో పాటు ఇటు నంద్యాలలో రాజకీయాలు చేయాలని ఆమె తలపోశారు. ఈ క్రమంలో వరుసకు సోదరుడయ్యే భూమా బ్రహ్మానందరెడ్డి తో విభేదాలు పెంచుకున్నారు. అటు ఆళ్లగడ్డలో తెలుగుదేశం సీనియర్ నేతలతో కోలుకోలేని అగాధం సృష్టించుకున్నారు. రెండు చోట్ల పార్టీలో విభేదాలకు కారణమయ్యారు. అదే సమయంలో అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీతో పాటు భూమా కుటుంబం చరిత్ర మసకబారింది. అఖిల ప్రియ చర్యలతో విసిగి వేసారిపోయిన చంద్రబాబు ఈసారి ఆ రెండు చోట్ల అభ్యర్థులను మార్చాలని.. కొత్త వారితో పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారు.
అయితే మొన్నటి వరకు నంద్యాలలో భూమా బ్రహ్మానంద రెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు చూపారు. వచ్చే ఎన్నికల్లో అభ్యర్థి నువ్వేనంటూ సంకేతాలు ఇచ్చారు. దీంతో బ్రహ్మానందరెడ్డి తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే అక్కడ తాను పోటీ చేస్తానని భూమా నాగిరెడ్డి తనయుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. నంద్యాల తన సొంత నియోజకవర్గం.. భూమా నాగిరెడ్డి అడ్డా అని చెప్పుకొస్తున్నారు. సోదరుడు బ్రహ్మానంద రెడ్డి పై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ తరుణంలో అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయాయి. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతాయి.
ఈ నేపథ్యంలో ఇటీవల టిడిపి హై కమాండ్ నంద్యాల విషయంలో స్పష్టమైన ప్రకటన చేసింది. వచ్చే ఎన్నికల్లో నంద్యాల అభ్యర్థిత్వాన్ని మాజీ మంత్రి ఫరూక్ కు ఖరారు చేసింది. దీంతో బ్రహ్మానందరెడ్డి తో పాటు జగత్ విఖ్యాత్ రెడ్డికి ఒక్కసారిగా షాక్ తగిలింది. అటు అఖిల ప్రియ విషయంలో సైతం టిడిపి హై కమాండ్ సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. అక్కడ కూడా అభ్యర్థిని మార్చుతారని ప్రచారం జరుగుతోంది. భూమా నాగిరెడ్డి కుటుంబంలో వివాదానికి అఖిలప్రియ వైఖరి కారణమని ఆరోపణలు ఉన్నాయి. టిడిపి అధినాయకత్వానికి సైతం ప్రత్యేక నివేదికలు వెళ్లినట్లు తెలుస్తోంది. టిడిపి సీనియర్ల విషయంలో దూకుడుగా వ్యవహరించడం, కొన్ని మాటలు తూలడం తదితర కారణాలతో అఖిలప్రియను తప్పించడమే మేలన్న అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే భూమా కుటుంబం రాజకీయ చిక్కుల్లో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దీనిని ఎలా అధిగమిస్తారో చూడాలి.